వరంగల్ అర్బన్ జిల్లాలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి ప్రాథమిక బంధువులకు సంబంధించి మరో పాజిటివ్ కేసు నమోదైంది. మర్కజ్ వెళ్లి వచ్చినవారి బంధువులకు సంబంధించి మొత్తం 242 మంది నమూనాలను తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ పంపించగా దశలవారీగా వచ్చిన ఫలితాల్లో 241 మందికి నెగిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఒకరికి పాజిటవ్‌గా వైద్యులు నిర్ధారించారు.
మర్కజ్ వెళ్లి వచ్చి పాజిటవ్‌గా నమోదైన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తికి కొవిడ్-19 పాజిటవ్ వచ్చిందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి లలితాదేవి తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన 24 మందికి కరోనా పాజిటవ్ స్పష్టం అయ్యింది. గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.