వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా పాజిటివ్ వ్యక్తులంతా కోలుకుని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు పిల్లలతో సహా... మొత్తం 27 మంది వైరస్ సోకగా... వారందరికీ గాంధీలో చికిత్స అందించారు. తొలుత మార్చి నెలలో విదేశాల నుంచి వచ్చినవారెవరికీ వైరస్ సోకకున్నా....మర్కజ్ పరిణామాల అనంతరం ఒక్కసారిగా జిల్లాలో కేసులు పెరిగాయ్.
మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో 24 మందికి పాజిటివ్ రాగా.....ఆ తరువాత....వారితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి కూడా పాజిటవ్‌గా నమోదైనట్లు పరీక్షల్లో వెల్లడైంది. వీరందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరితో ప్రాథమికంగా సంబంధం ఉన్న...700 మందికి కూడా పరీక్షలు నిర్వహించారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు నివసిస్తున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి....నిర్భంధం చేశారు.
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పోలీస్ కమిషనర్ వి. రవీందర్, జిల్లా వైద్య శాఖకు చెందిన అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుని.. వైరస్ వ్యాప్తి కాకుండా కట్టడి చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్‌లు తరచూ.. నియంత్రణ చర్యలపై సమీక్షలు నిర్వహించారు. లాక్‌డౌన్‌ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల కేసులు పెరగలేదు.
రెడ్ జోన్‌గా ఉన్న వరంగల్ అర్బన్ జిల్లాలో 18 రోజుల నుంచి కొత్తగా ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. ఆరెంజ్ జోన్లోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇక భూపాలపల్లి, జనగామకు చెందిన ఒక్కొక్కరు మాత్రం ఇంకా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.