వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ-నిట్ ఎన్నో పరిశోధనలకు పెట్టింది పేరు. మానవాళిని హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి స్వభావం, దాని మార్పులకు సంబంధించి నిట్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. నిట్‌లో బయోటెక్నాలజీ విభాగంలో పనిచేస్తున్న సహాయ ఆచార్యులు పెరుగు శ్యామ్... కరోనా రూపాంతరం చెందే తీరుపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్రం 2 కోట్ల రూపాయల నిధులు అందించింది. దాదాపు 30 స్ట్రెయిన్లు... వాటి రూపొంతరాలపై పరిశోధనలు సాగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ఎఫ్డీఓ డేటాబేస్ ఆధారంగా లభించిన సమాచారంతో... నిట్‌లో వైరస్ మ్యూటేషన్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందడంతో... కొవిడ్‌ను నియంత్రించే ఔషధం కనిపెట్టడం అసాధ్యంగా మారుతోందని చెప్పారు. మొదటి దశతో పోలిస్తే రెండోదశ తీవ్రత అధికంగా ఉంటుందని గుర్తించామని... అదే ప్రస్తుతం జరిగిందని నిట్ ఆచార్యులు పేర్కొన్నారు. మూడోదశలో వైరస్ రూపొంతరాలు చెంది... హైబ్రీడ్ వెరియంట్‌గా మారే ప్రమాదం ఉందని... పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడోదశను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా నష్టనివారణ తగ్గించవచ్చని చెబుతున్నారు.
కొవిడ్ సోకినా భయపడకుండా ఎదుర్కోవాలని... వీలైనంత వరకూ జన సముహాల్లోకి వెళ్లకుండా ఉండాలని ప్రజలకు పరిశోధకులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
- ఇదీ చదవండి : మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు ఎందుకు తింటారంటే?