గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ‘మై జీడబ్ల్యూఎంసీ’ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనిని బల్దియా సమావేశ మందిరంలో మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కమిషనర్ పమేలా సత్పతి విడుదల చేశారు. ఏడాదిన్నర క్రితమే అప్పటి కమిషనర్ గౌతమ్ హయాంలోనే తయారైంది. మడికొండకు చెందిన కాకతీయ సొల్యూషన్ సంస్థ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించగా, గ్రేటర్ కంప్యూటర్ విభాగం నిపుణులు సహకరించారు. బల్దియా ద్వారా అందిస్తున్న వివిధ రకాల సేవలను నగర ప్రజలు సమగ్రంగా సునాయాసంగా మొబైల్ ద్వారా తెలుసుకొనే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మేయర్ పేర్కొన్నారు.
అన్ని సేవలు అందుబాటులో..
రాష్ట్రంలోనే తొలిసారిగా వరంగల్ కార్పొరేషన్లో ఈ సేవలు ప్రారంభించినట్లు మేయర్ గుండా ప్రకాశ్‌రావు తెలిపారు. ఫిర్యాదుల నమోదు, ఆస్తి పన్ను, వాణిజ్య లైసెన్స్, గ్రీన్లెగసీ, వినియోగదారు ఛార్జీలు, మీటర్ ట్యాప్‌తో పాటు ఇతర బిల్లులను చెల్లించవచ్చని వెల్లడించారు. నగర పౌరులు ఈ యాప్ ద్వారా సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: జులై ఆఖరుకు దేశంలో 10 లక్షల కేసులు