వరంగల్ జిల్లాలో.. ఉగాది నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగు నీటిని అందిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తాగు నీటి కోసం రూ.1,200 కోట్లు ఖర్చు పెడుతోందని వెల్లడించారు. హన్మకొండలోని పెగడపల్లి డబ్బాల వద్ద రూ.కోటి 50 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్తో కలిసి ప్రారంభించారు.
ప్రజలు గమనించాలి..
రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మంచి ప్రణాళికలతో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వివిధ పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తాయన్నారు. గత ప్రభుత్వాలు ఏం చేశాయో.. తెరాస ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతుందో ప్రజలు గమనించాలని కోరారు. వరంగల్ నగరంలో అన్ని అభివృద్ధి పనులు వీలైనంత వేగంగా పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఇదీ చదవండి:లెక్కల మాస్టారుకు.. ఎనలేని సత్కారం!