Postcard war for Employment guarantee scheme restoration : గ్రామీణ ప్రజల ఉపాధి ఊతమిచ్చేందుకు తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడవద్దంటూ.... ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటూ వరంగల్ జిల్లా నర్సంపేటలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వినూత్నరీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులు, ఉపాధి హామీ కూలీలను భాగస్వామ్యం చేస్తూ.... కేంద్ర ప్రభుత్వానికి పోస్టుకార్డులు పంపే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 11రోజుల క్రితం ఉత్తర యుద్ధం పేరుతో మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 179గ్రామాలు, 24 మున్సిపాలిటీల నుంచి 2 లక్షల ఉత్తరాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపించారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి: ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. కేంద్రం స్పందించకుండా పనిదినాలను మరింత తగ్గించిందని పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు మోదీ సర్కార్ కుట్రలు చేస్తుందని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. ఈ ఉత్తర యుద్ధంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
"ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. నియోజక వర్గంలో ఉన్న పని దినాలను ఇప్పటికే సగం వరకు తగ్గించింది. ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చినప్పుడు జాజ్కార్డు ఉన్న అభ్యర్థులు ఉపాధి కోల్పోయారు. పేద వర్గాలు అన్యాయం అవుతున్నాయి. వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే పని దినాలు తగ్గించేశారు. దీంతో పాటు జాబ్‌కార్డులను రద్దు చేశారు. వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఉపాధి హామీ పథకాన్ని మళ్లీ పునరుద్ధరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం." -పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే
కనీసం రూ.100 రావట్లేదు: ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్విర్యం చేయాలని చూస్తోందని.. అందువల్లే వార్షిక బడ్జెట్లో రూ.30 వేల కోట్లు తగ్గించారని కొన్ని రోజుల కిందట మంత్రి హారీశ్ రావు పేర్కొన్నారు. కూలీలకు పని చేసే రోజుల తగ్గుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో రోజుకు రూ.257 ఇవ్వాలని ఉన్నప్పటికి.. కనీసం వంద రూపాయలు ఇవ్వట్లేదని మండిపడ్డారు. దీంతో పాటు పని చేసే ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చట్లేదని ఆరోపించారు.
ఇవీ చదవండి: