పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో వరంగల్ రానున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రెండు పడక గదుల ఇళ్లు, భద్రకాళీ బండ్ సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొననున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు, తాగునీటి సరఫరా, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్‌లు సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, నిధుల విడుదల, కార్మికుల అందుబాటు తదితర అంశాలపై సమీక్షించారు.
కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయని.. వాటిని రానున్న 3 నెలల్లోపే పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు సూచించారు. నగర బృహత్తర ప్రణాళికను ముఖ్యమంత్రి ప్రకటిస్తారని తెలిపారు. నగరానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు.