ఆలయాల పేరుతో భాజపా నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వరంగల్లోని తెరాస పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కార్యాలయాల్లో కేంద్ర మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆలయాల వద్ద చర్చకు దిగితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉందన్నారు.
భాజపా నాయకులకు వరంగల్ నగరంలో క్యాడరే లేదని మంత్రి ఎద్దేవా చేశారు. కేంద్రం.. చెన్నై, గుజరాత్ రాష్ట్రాలకు ఇచ్చిన వరద సహాయం తెలంగాణకు ఎందుకివ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వంపై నిందలు మోపడం ఇకనైనా మానుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం పగటి కలే'