వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నగరంలో ఎక్సెల్ ఇండియా లీడర్షిప్ మీట్ ఆధ్వర్యంలో వరంగల్ నగరాభివృద్ధి-అజెండా 2021 అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలు అజిత సురభి పాల్గొన్నారు. పీవీకి ఘనంగా నివాళులర్పించారు.
రాజకీయాలకు అతీతంగా.. మేధావులు, విద్యావంతులు.. వరంగల్ నగరాభివృద్ధికి సలహాలు ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అవసరమైతే.. కొంత మందిని సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధమని మంత్రి చెప్పారు. ఎస్సారెస్పీకి ఒక జలాశయం నిర్మాణానికి ప్రయత్నిస్తున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అనంతరం ఆ హమీని విస్మరించిందన్నారు. రైల్వే శాఖ నుంచి ఎలాంటి పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదన్న వినోద్‌కుమార్.. దీనికోసం కేంద్రాన్ని నిలదీయాలన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు.. ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని నిశితంగా పరిశీలించాలని ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ చెప్పారు.
ప్రస్తుత విద్యావిధానంలో మార్పురావాలని, యువతకు ఉపాధి అందించే కోర్సులను విశ్వవిద్యాలయాలు రూపకల్పన చేయాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు.
ఇవీచూడండి: రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ నివేదికలు రూపొందించాలి: సీఎస్