హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో నిర్వహించనున్న తెరాస విజయగర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli dayakar rao latest news) తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి సభా స్థలిని మంత్రి పరిశీలించారు. ఈనెల 29న నిర్వహించనున్న ఈ విజయగర్జన సభకు 12 లక్షలు మంది హాజరుకానున్నారని తెలిపారు. సభా నిర్వహణకు స్థలాలు ఇచ్చిన దేవన్నపేట రైతులకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌కు బుధవారం రానున్నారని... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినందుకే భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి ఆ రోజు దీక్ష చేపట్టిన రోజు. 20 సంవత్సరాల ఉత్సవాలు ఇక్కడ సుమారు 12 లక్షల మందితోటి పెద్దఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ బహిరంగ సభనే కాకుండా ఈనెల 28,29న ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకొని.. గ్రామాల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు చేసుకొని సభకు రావడం జరుగుతుంది. వరంగల్ పూర్వ జిల్లాలోనే 2.5లక్షల నుంచి 2.8లక్షల మంది వరకు సమీకరణ చేస్తున్నాం. సభాస్థలం కోసం ఇప్పటివరకు 300 ఎకరాలు సేకరించడం జరిగింది. రైతులు చాలామంది కూడా వాలంటీర్‌గా ముందుకు వచ్చారు. చాలామంది ఇవ్వకుండా ఉండాలని ప్రయత్నం చేసినా కూడా... రైతులే వచ్చి ఇచ్చారు. ఈ ప్రాంత రైతులకు కృతజ్ఞతలు. రేపు వరంగల్‌లో ముఖ్యమంత్రి పర్యటన ఉంది. పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తాం.
-ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ముమ్మర ఏర్పాట్లు
వరంగల్‌లో ఈనెల 29న నిర్వహించనున్న తెరాస విజయగర్జన (Trs Vijaya Garjana) సభ నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లుచేస్తున్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో రింగు రోడ్డు పక్కన నిర్వహిస్తున్న సభ స్థలాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఇదివరకే పరిశీలించారు. ప్రజలు సభకు చేరుకునే ప్రధాన రహదారులను, పార్కింగ్, సభ స్థలాన్ని పరిశీలించారు. స్థానిక రైతుల సమ్మతితోనే ఈ భూములలో సభను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవలె తెలిపారు. పనులు కూడా మొదలు పెట్టామని పేర్కొన్నారు. కొంత మంది కావాలని అనుమానాలను రేకిత్తించారని అన్నారు. సభకు 12 లక్షల మంది వచ్చే ఆవకాశం ఉందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నివేదిస్తారని తెలియజేశారు.
తొలుత ససేమిరా..
ఈనెల 29న వరంగల్‌లో తెరాస నిర్వహించ తలపెట్టిన విజయ గర్జన సభ(Trs Vijaya garjana)కు తమ భూములు ఇవ్వమని దేవన్నపేట రైతులు (Devannapet Farmers) తొలుత ఆందోళన చేపట్టారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో ఉన్న వ్యవసాయ భూముల్లో విజయగర్జన సభ నిర్వహించేందుకు అధికార తెరాస ప్రణాళికలు వేసింది. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది రైతులు ప్రారంభంలో ఒప్పకోలేదు. పంటలు పండే భూములను మేము ఎలా ఇస్తామని ప్రశ్నించారు. అంతేకాకుండా సభాస్థలి పరిశీలన కోసం వచ్చిన తెరాస నాయకులు, అధికారులు, పోలీసులతో రైతులు గొడవకు దిగారు. సభకు తమ భూములు ఇవ్వమని రైతులు స్పష్టం చేశారు. పంట పొలాల భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని రైతులు అవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పంటలు పండే భూముల్లో సభ నిర్వహించవద్దని రైతులు వేడుకున్నారు. సిటీకి దగ్గర ఉన్నందున మేము కూరగాయలు పెట్టుకున్నామని ఒక రోజు సభ కోసం మా పంట భూములను నాశనం చేస్తారా అని రైతులు వాపోయారు. ఆ తర్వాత పలువురు రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభాస్థలిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ పరిశీలించారు.
ఇదీ చదవండి: Trs Vijayagarjana: యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న తెరాస విజయగర్జన సభ ఏర్పాట్లు