తెరాస ఏడేళ్ల పాలనలో వరంగల్‌ను అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నీటితో ఓరుగల్లును సస్యశ్యామలం చేశారని కొనియాడారు. ప్రజల అభీష్టం మేరకే వరంగల్, హన్మకొండ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్బన్, రూరల్ అంటూ గందరగోళం లేకుండా పేర్ల మార్పు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కలిసి హన్మకొండలో మంత్రి మాట్లాడారు.
వరంగల్‌కు వెటర్నరీ, దంత వైద్య కళాశాలలు మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దేవాదుల జలాలతో నీటి కొరత తీర్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సైతం ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. ఓరుగల్లు ప్రజలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. రెండు జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. హామీల కంటే ఎక్కువగానే అభివృద్ధి చేస్తున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఎంజీఎం పర్యటన కొవిడ్ బాధితుల్లో ధైర్యం నింపిందని.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎవరూ ఈ విధంగా చేయలేదన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో సాంకేతిక సిబ్బంది కోసం ఎక్కువ జీతమిచ్చైనా నియమించుకోవాలని ఆదేశించారని తెలిపారు. భూపాలపల్లిలో వంద పడకల ఆస్పత్రిలో కూడా సిబ్బందిని రెండు రోజుల్లోనే నియమించుకోవాలని సీఎం సూచించారని వెల్లడించారు. వరంగల్‌కు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రావడం జిల్లా ప్రజల అదృష్టమని చెప్పారు. కేంద్ర కారాగారం వెనుక 23 ఎకరాలు ఉందని.. ఏడాదిలోపే ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొన్నారు.
కేంద్రం ఒక్క హామీనైనా అమలు చేసిందా?
కేంద్ర నిర్లక్ష్యం వల్లే సకాలంలో వ్యాక్సిన్లు అందట్లేదని ఎర్రబెల్లి ఆరోపించారు. కష్టకాలంలో ప్రధాని రాష్ట్రాలకు వచ్చి కనీసం సమీక్షా సమావేశాలనైనా నిర్వహిస్తే బాగుంటుందని ఆయన తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీలను నిలబెట్టుకోలేదని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. బోగస్ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ములుగు గిరిజన యూనివర్సీటీ కోసం భూమి చూపించిన పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి చేతనైతే సహకరించండి.. అడ్డుపడే ప్రయత్నం మాత్రం చేయకండని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హితవు పలికారు. విభజన హమీలను కేంద్రం ఏ ఒక్కటీ నేరవేర్చలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట్ రైల్వే కోచ్ ప్యాక్టరీ ఊసే లేదు. అసత్యాలు ప్రచారం చేసే భాజపా నేతలు కేంద్రం ఇచ్చినా హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్, మహారాష్ట్ర కైతే వెంటవెంటనే అమలు చేస్తారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేసిందేమీ లేదని ఎర్రబెల్లి ఆరోపించారు.
ఇదీ చూడండి: KCR: వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాల పేరు మార్పు