ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్రబ్యాంకులో ఏడాది కాలంలోనే అనేక మార్పులు తీసుకొచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న బ్యాంకును లాభాల బాటలో నడిపించారని కొనియాడారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేడ్కర్ భవన్‌లో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘాల ఛైర్మన్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు.
సొసైటీ ఛైర్మన్లు కష్టపడి పనిచేసి సహకార బ్యాంకుకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచించారు. గతంలో ఉన్న సొసైటీ ఛైర్మన్లు ఇష్టారీతిన లోన్లు ఇచ్చి, వాటిని రికవరీ చేయలేక బ్యాంకును అస్తవ్యస్తం చేశారన్నారు. తాను సొసైటీ ఛైర్మన్గా పని చేసినప్పుడు లోన్ల రికవరీ కోసం తన ఇంట్లో వాళ్లకూ నోటీసులు ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రతి సొసైటీ ఛైర్మన్ నిస్వార్థంగా పని చేయాలని సూచించారు. అనంతరం సహకర సంఘాల అభివృద్ధికి నాబార్డ్ అందిస్తున్న రుణాలను పాలకవర్గాలకు అందజేశారు.
ఈ సదస్సుకు టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు హాజరయ్యారు.