Medigadda Barrage Issue Update : బీడువారిన పొలాలను సస్యశ్యామలం.. రాష్ట్రానికే జలప్రదాయినిగా పేరగాంచిన ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ(Medigadda Lakshmi Barrage) వంతెన కొంతమేర కుంగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజీ సామర్థ్యంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వంతెన 20వ పిల్లర్ బేస్ మెంట్ దెబ్బతిన్నట్లుగా సమాచారం. 19, 20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ తిరుపతి రావు.. ఇతర అధికారులు, గుత్తేదారులు ఇంజినీరింగ్ నిపుణులు వంతెన దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులు, ఇతర అధికారులు బ్యారేజీ సమీపంలోనే సమీక్ష చేపట్టారు. తక్షణమే తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.
Medigadda Barrage Bridge Pillars Slightly Sagged : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై రాకపోకలు సాగించే వంతెన గత రాత్రి వంతెన కుంగడంతో యుద్ధ ప్రాతిపదికన జలాశయం ఖాళీ చేసే పనులు చేపట్టారు. రాత్రి నుంచి క్రమంగా గేట్ల సంఖ్య పెంచుతూ.. నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. బ్యారేజీ గేట్లను మూసివేశారు.
మేడిగడ్డ బ్యారేజీ పై వంతెన కుంగడంతో.. కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు ఇటు మహారాష్ట్రలోని సిరోంచ, భూపాలపల్లిలోని మహదేవ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం 6.20 నిమిషాల వద్ద భారీ శబ్దం వినిపించిందని.. వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్లాక్ నెంబర్ 7లోని19, 20, 21 పిల్లర్ల దెబ్బతిన్నాయని.. మహారాష్ట్ర వైపు ఉన్న పిల్లర్ 20 పైనున్న గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసాంఘీక శక్తుల ప్రమేయం ఉండచ్చని అనుమానిస్తున్నామని దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గోదావరిపై 2019లో మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. వంతెన కుంగిన సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25,000 క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా.. 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో ఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల నిల్వ ఉంది. శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించిన విషయం విధితమే.
Revanth Reddy on Medigadda Barrage Issue : మేడిగడ్డ లక్ష్మీ ప్రాజెక్టు కుంగడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. నాణ్యతలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని ఆరోపించారు.కేసీఆర్ గొప్ప ఇంజినీరుగా చెప్పుకుని రూ.లక్ష కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు జరిపించాలని తెలిపారు. కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు డిజైన్ రూపొందించాని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారని గుర్తుచేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ ఎన్నోసార్లు చెప్పారని రేవంత్ పెర్కొన్నారు.