కరోనా తగ్గట్లేదు సరికదా.... రోజురోజుకీ మరింత విజృంభిస్తోంది. కొవిడ్ మహమ్మారి పొంచి ఉన్న ఈ సమయంలో... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... గర్భిణీలకు వైరస్ సోకుతోంది. ఓ వైపు తమకేమవుతుందోనన్న ఆందోళన... మరోవైపు పుట్టే బిడ్డ పరిస్థితి ఏమిటన్న భయం... వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మెరుగైన చికిత్సతో... వైద్యులు వారికి అండగా నిలుస్తున్నారు. వారి భయాలను పటాపంచలు చేస్తూ.. మానసికంగా ధైర్యం నింపి చికిత్స అందిస్తున్నారు.
30 పడకలతో ప్రత్యేక వార్డు
హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వంద పడకలే ఉన్నా... రద్దీ అధికంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా... కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి ప్రసవం కోసం ఇక్కడకు వస్తారు. కొవిడ్ దృష్ట్యా ఆసుపత్రిలో 30 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. కరోనా మొదటి దశలో 80 మందికి పైగా గర్భిణీలు... కొవిడ్ బారిన పడినా... అందరూ కోలుకున్నారు. రెండో దశలో ఈనెలలో 20 మంది కరోనా బారిన పడ్డారు. వైద్యులు వారికి ధైర్యం చెప్పి త్వరగా కోలుకునేలా చికిత్స అందిస్తున్నారు.
సంతోషంగా ఇంటి బాట
కొవిడ్ సోకితే ఆందోళన చెందకుండా త్వరగా చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిశుభ్రంగా ఉంటూ... వేడి ఆహారం, పండ్లు తీసుకోవాలని... ఏ మాత్రం లక్షణాలు కనిపించినా ఆసుపత్రికి వచ్చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనలు పాటించి... కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత... తల్లీబిడ్డలు సంతోషంగా ఇంటి బాట పడుతున్నారు.
ఇదీ చదవండి: 'ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపై తాజా మార్గదర్శకాలు ప్రకటించండి'