వర్షాలు వరదలతో అతలాకుతలమైన ఓరుగల్లు నగరంలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా నిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు ఈటెల, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి... ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పురపాలక, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు అరవింద్ కుమార్, ముర్తుజా రిజ్వీ...కూడా వీరి వెంట ఉన్నారు.
రూ. 10 కోట్లు కేటాయింపు..
జలమయమైన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన కేటీఆర్.. నగరంలో ఉద్ధృతంగా ప్రవహించిన నాలాలను ప్రత్యక్షంగా చూశారు. హన్మకొండ- కరీంనగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు ఆటంకంగా నిలిచి సమీపంలోని కాలనీలను జలమయం చేసిన నయీమ్ నగర్ నాలాను పరిశీలించారు. అనంతరం.. సమ్మయ్య నగర్లో వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. నేరుగా బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కాలువ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
వరద నీటిలో కిలోమీటర్ నడక..
గోపాల్పూర్, పెద్దమ్మ గడ్డ , యూనివర్శిటీ రోడ్, పొతన నగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్ రోడ్, సంతోషిమాత గుడి, ఉర్సు, రంగశాయిపేట, శివనగర్ తదితర ప్రాంతాల్లో నాలాలు, ముంపు ప్రాంతాలు, దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. హంటర్ రోడ్లో...రహదారిపై నీరు నిలిచిపోవడంపై.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కిలోమీటర్ మేర నడిచి వెళ్లి మరీ వరద తీవ్రతను గమనించారు. నాలాల ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని.. కేటీఆర్ దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. యుద్ధప్రాతిపదికన ఆక్రమణలను కూల్చేయాలని, నాలాలను విస్తృతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భద్రకాళీ చెరువు ప్రవాహం పెరిగినప్పుడు.. వరదనీరు త్వరగా ప్రవహించేలా మార్గాలు అన్వేషించాలన్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న విపత్తు నిర్వహణ బృందాన్ని కేటీఆర్ అభినందించారు.
అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ వార్డును సందర్శించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైరస్ సోకినంత మాత్రాన అధైర్యపడాల్సిన అవసరం లేదంటూ భరోసా నిచ్చారు. ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులను మంత్రి కేటీఆర్ అభినందించారు.
ఎన్ని నిధులు కావాలన్నా..
వరంగల్ నిట్‌లో అధికారులతో.. మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్.. రూ.25 కోట్లు మంజూరు చేశారని ఈ సమావేశంలో వెల్లడించారు. నగరం మరోసారి ముంపు బారినపడకుండా తీసుకోవాల్సిన శాశ్వత చర్యలకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి, పురపాలక, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, వైద్యారోగ్య శాఖ అధికారులతో దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. నాలాల ఆక్రమణలను ఎట్టపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్..
నాలాల ఆక్రమణల తొలగింపు కోసం... జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా... సీపీ వైస్‌ఛైర్మన్‌గా, కమిషనర్ ఇతర అధికారులు సభ్యులుగా టాస్క్‌ఫోర్స్ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. సంబంధించిన ఉత్తర్వులను పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ జారీచేశారు. నెలరోజుల్లోగా ఆక్రమణలు తొలగించాలని, ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. కూల్చివేతల సమయంలో ఒత్తిడులను పట్టించుకోవద్దని ప్రజాప్రతినిధులకు సూచించారు. పేదవారుంటే... రెండు పడకల ఇళ్లు మంజూరు చేయవచ్చని సూచించారు.
అక్రమ కట్టడాల కూల్చివేతలకు అత్యాధునిక యంత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. పట్టణం బాగుండాలంటే...అక్రమ కట్టడాల కూల్చివేత తప్పనిసరని... ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ఆక్రమణలు తొలగించడం సహా... నాలాల వద్ద సమాంతరంగా రిటైనింగ్ వాల్ కడితేనే ఆక్రమణలకు అడ్డుకట్ట వేయవచ్చని కేటీఆర్ అన్నారు.
త్వరలో నగర బృహత్ ప్రణాళిక..
గొలుసుకట్టు చెరువులకున్న ఫీడర్ కాలువలను సమర్థవంతంగా నిర్వహిస్తే...వరద ఇబ్బందులు ఉండవన్నారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోందని.. నగరంలో శిథిల భవనాలను త్వరగా కూల్చేయాలని ఆదేశించారు. వరంగల్ నగర బృహత్ ప్రణాళిక ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని.. సీఎం ఆమోదంతో త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. వరంగల్ నగరం ఇకపై పద్ధతి ప్రకారం అభివృద్ధి జరగాలన్నారు.
వరంగల్ అంటే కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం..
ముఖ్యమంత్రికి వరంగల్ అంటే ప్రత్యేక అభిమానం ఉందని... భారీ వర్షాలు, వరదలు.. సీఎంకు ఆందోళన కలిగించాయన్నారు. ముఖ్యమంత్రి రావాలనుకున్నా... సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో తనను పంపించారన్నారు. తక్షణ అవసరాల కోసం రూ. 25 కోట్ల మంజూరు చేశారన్నారు. పూర్తిస్థాయి అంచనాల తరువాత ఎన్ని నిధులు కావాలన్నా.. ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జరిగిన శాస్త్రీయంగా అంచనా వేయాలని నష్టాన్ని అధికారులను ఆదేశించారు.
కొవిడ్ కట్టడిపై..
కొవిడ్ నియంత్రణకు మరింత కృషిచేయాలని కేటీఆర్ సూచించారు. పడకలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, పరీక్షలు సంఖ్య పెంచాలని స్పష్టం చేశారు. ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ కొవిడ్ ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభించాలని కేటీఆర్ తెలిపారు.
భారీ వర్షాలు వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణనష్టం సంభవించనందుకు అధికారులకు.. అభినందనలు తెలిపారు. కేటీఆర్ పర్యటన అనంతరం .. అక్రమ కట్టడాల కూల్చివేతను మరింత వేగవంతం చేశారు అధికారులు. నయీం నగర్ నాలా చుట్టూ ఉన్న భవనాలను జేసీబీలతో తొలగించే ప్రక్రియ ప్రారంభించారు.
ఇవీచూడండి: అధైర్య పడకండి.. ప్రతిఒక్కరినీ ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్