వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మొదలవనున్నాయి. ఆదివారం సాయంత్రం 5:30కి స్వామివారి కల్యాణ మహోత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
ఆదివారం స్వామివారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. 13న భోగి, 14న సంక్రాంతి, 18న భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ముగుస్తాయని తెలిపారు. దీనికోసం ఆలయ అధికారులు ఆలయాన్ని, ఆలయ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్ది.. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాతరలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎంపీ లక్ష్మీకాంతారావు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఆలయ చరిత్ర అద్భుతం..
కుమ్మరులు కట్టెల కోసం కొండ పైకి వెళ్లి నిద్రించగా.. కలలో వారికి వీరభద్ర స్వామి దర్శనం ఇచ్చాడని.. తరువాత కొండపై నుంచి వీరభద్ర స్వామి ప్రతిమను కిందకు తీసుకువచ్చి మహమ్మాయి దేవాలయంలో ప్రతిష్ఠించారని ఆలయ పురాణం చెబుతుంది. అప్పటి నుంచి మొదట కుమ్మరి వాళ్లు వీర భోనం చేసి, బండ్లు తిరిగిన తర్వాతే మిగతావాళ్ళ బండ్లు స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాయి. ప్రతీ ఏడు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతూ ఉంటుంది.
ఇదీ చూడండి: కిడ్నాప్ కేసు: ఉస్మానియా ఆస్పత్రిలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు