ఉపాధి, ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం విమర్శించారు. ఉద్యోగాలు కల్పించాలంటూ కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బోడ సునీల్‌ను ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు.
ఉన్నత చదువులు చదివి ఎలాంటి నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోదండరాం ఆరోపించారు. ఇది చాలా బాధాకరమన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు దాటినా.. నిరుద్యోగులకు ఎలాంటి ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నామని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన కోరారు.