Kaloji Health University Notification on PG Medical Seats : రాష్ట్రంలో పీజీ వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత పీజీ వైద్య విద్య సీట్ల ప్రవేశాల కోసం.. ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు తెలిపింది. కాళోజీ హెల్త్ వర్సిటీ (Kaloji Health University) పరిధిలోని కళాశాలలకు అదే విధంగా.. నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ నెల 13 ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ రాత్రి 8 గంటల వరకూ.. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే మెరిట్ జాబితా.. అదేవిధంగా సీట్ల ఖాళీల ( Medical Seats) వివరాలను.. వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని అధికారులు సూచించారు.
ఎంసెట్ పరీక్ష ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ
మరోవైపు తెలంగాణలో 2014 జూన్ తర్వాత కాంపిటీటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను.. రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తున్నట్లు.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల ఆడ్మిషన్ నిబంధనలు-2017ను సవరించింది. ఇదివరకు ఉన్న నిబంధనల ప్రకారం వైద్య కళాశాలల్లోని మొత్తం సీట్లలో.. 85 శాతం కాంపిటీటివ్ అథారిటీ కోటా కాగా.. మిగతా 15 శాతం అన్‌రిజర్వుడ్ విభాగానికి చెందుతాయి.
Kaloji Health University : ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్
పునర్విభజన చట్టం నేపథ్యంలో ఈ సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులూ పోటీ పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైనా.. 36 మెడికల్ కాలేజీల్లో 100 శాతం కాంపీటీటివ్ అథారిటీ కోటా సీట్లన్నింటినీ తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు. ఈ నిర్ణయంతో 520 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా లభించనున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు.. ఉమ్మడి రాష్ట్రంలో.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కలిపి మొత్తం 20 కళాశాలలు ఉండగా, వాటిలో 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. అందులో కాంపిటీటివ్ కోటా కింద ఉన్న 1,895 సీట్లలో 15 శాతం (280సీట్లు) ఉమ్మడి కోటా అంటే తెలంగాణ, ఏపీ విద్యార్థులూ పోటీపడేవారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైద్య కళాశాల సంఖ్య 56కు పెరిగింది. తద్వారా సీట్ల సంఖ్య 8440కి చేరింది. పాత విధానమే కొనసాగితే కొత్తగా నిర్మించిన 36 వైద్య కళాశాలల్లోను 15 శాతం ఉమ్మడి కోటా అమలు చేయాల్సి వచ్చేది. దీనివల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతారని గుర్తించిన సర్కార్.. ఉమ్మడి కోటాను పాత 20 కాలేజీలకే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించింది. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన.. 36 కాలేజీలల్లోని కాంపిటీటివ్ అథారిటీ కోటా సీట్లన్ని తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.
Medical Colleges in Telangana : కొత్తగా 12 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం
Harish Rao on Telangana MBBS seats : 'వైద్యసీట్ల పెంపులో తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది'