రాష్ట్రంలోని మూడు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో గతేడాది(2021-22)లో కౌన్సెలింగ్ ద్వారా చేరిన విద్యార్థుల సీట్లను రద్దు చేస్తూ జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎంఎన్‌సీ) ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినందున ఈ విద్యార్థులను ఇతర వైద్య కాలేజీల్లో చేర్చుకుని సర్దుబాటు చేస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఎంఎన్‌ఆర్, టీఆర్‌ఆర్, మహావీర్ కాలేజీల సీట్లను రద్దు చేసినందున కౌన్సెలింగ్ ద్వారా వీటిలో చేరిన వారిని ఇతర కాలేజీల్లో చేర్చుకోవాలని ఎంఎన్‌సీ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను అమలు పరిచేందుకు రాష్ట్రానికి స్పష్టమైన మార్గదర్శకాలను ఇవ్వాల్సిందింగా మళ్లీ ఎంఎన్‌సీని కోరినట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంఎన్‌సీ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చాకా.. విద్యార్థులను నిబంధనల మేరకు యూనివర్సిటీ పరిధిలోని వివిధ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేయడం జరుగుతుందని ఉపకులపతి స్పష్టం చేశారు. ఆయా కళాశాలల్లోని ఏ ఒక్క విద్యార్థి సీటు కోల్పోరని, ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ఇదీ చూడండి..
Kaloji University: కాళోజీ వర్సిటీ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్