వరంగల్ కాకతీయ వైద్య కళాశాల వజ్రోత్సవ శోభతో కళకళలాడుతోంది. 1959 జులై 23న వడ్డేపల్లిలోని ఓ చిన్న క్యాంపస్లో రీజినల్ మెడికల్ ఎడ్యుకేషనల్ సొసైటీగా 50 మంది విద్యార్ధులతో ప్రారంభమైన ఈ వైద్య కళాశాల....అనతికాలంలోనే ప్రతిష్ఠాత్మక కళాశాలగా రూపుదిద్దుకుంది. పద్మశ్రీ పురస్కారం పొందిన డాక్టర్ రెహమత్ బేగంతో పాటుగా... దేశ విదేశాల్లో వైద్య సేవలందించే ప్రముఖ వైద్యులను, ఈ కళాశాల అందించింది. ఎంతోమంది మేధావులు...కళాశాల ప్రిన్సిపల్స్గా.. తమ సేవలందించారు.
కళాశాల అభివృద్ధిలో భాగస్వాములైన ప్రముఖులు
ప్రస్తుతం 153 ఎకరాల విస్తీర్ణంలో...విస్తరించిన ఈ కళాశాల తెలంగాణలో ఉస్మానియా, గాంధీల తరువాత...పెద్ద వైద్య కళాశాలగా పేరొందింది. ఉత్తర తెలంగాణ ఆరోగ్య ప్రదాయనిగా భావించే ఎంజీఎంతోపాటు... మరో నాలుగు ఆసుపత్రులు కాకతీయ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండడం విశేషం. కార్డియాలజీ, రేడియాలజీ, ఫాథాలజీ, గైనకాలజీ ఇలా మొత్తం 19 స్పెషలైజేషన్ కోర్సులను ఇక్కడ బోధిస్తున్నారు. 1966లో కొత్త కళాశాల ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముఖ్య అతిధిగా విచ్చేశారు. అంతకుముందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖులు కళాశాలకు సంబంధించిన అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.
ఈ కళాశాలలోని ప్రయోగశాలలు...విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఇక్కడి గ్రంథాలయం విజ్ఞాన భాండాగారమనే చెప్పాలి. బ్రిటిష్ కాలంనాటి వైద్య పుస్తకాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ప్రజాకవి కాళోజీ, ఆయన సోదరులు రామేశ్వరరావు.... ఇంకా అనేక మంది దాతలు.. విద్యార్థుల ప్రయోగాలకు ఉపయోగపడే విధంగా తమ పార్థీవదేహాలను...కేఎంసీకి అందించారు.
వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రులు..
రెండు రోజుల పాటు జరిగే వజ్రోత్సవ వేడుకలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ముఖ్య అతిథులుగా పాల్గోగున్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వామి కావడం తన అదృష్టమని కళాశాల ప్రిన్సిపల్ సంధ్య తెలిపారు. త్వరలోనే అత్యాధునిక వసతులతో 250 పడకలతో కేఎంసీ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా రాబోతున్నట్లు చెప్పారు.
దేశ విదేశాల్లో వైద్యులుగా పనిచేస్తున్న... పూర్వ విద్యార్థులంతా ఈ వజ్రోత్సవాలకు హాజరవుతున్నారు. గుండె పోటు, ఇతర అంశాలపై వైద్య నిపుణులచే విద్యార్థులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. వేడుకల సందర్భంగా ప్రముఖ వైద్యులను. కళాశాల ప్రిన్సిపల్స్గా సేవలందించినవారిని విద్యార్థులు..ఘనంగా సత్కరించనున్నారు.
ఇవీ చూడండి: సమాజ సేవకుడిగా.... అభాగ్యులకు అండగా..