Jagadish Reddy Fires on PM Modi: విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో కరెంట్ వినియోగం చేస్తే.. 10 నుంచి 20 శాతం ఛార్జీలు పెంచాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ‘టైం ఆఫ్ డే’ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేంద్ర విద్యుత్ విధానాలు దేశాభివృద్ధికి అవరోధమని అన్నారు. విద్యుత్ రంగాన్ని మోదీ సర్కారు ప్రైవేట్ పరం చేస్తోందని దుయ్యబట్టారు. పీక్ లోడ్ అవర్స్‌లో విద్యుత్ వినియోగంపై టీవోడీ ఛార్జీల పేరిట అదనపు ఛార్జీలను వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Jagadish Reddy Fires on Central Govt: సామాన్య ప్రజలకు విద్యుత్ వినియోగం దూరం చేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, ప్రజలపై భారం వేసే ఆలోచన దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగంపై అదనపు ఛార్జీలు వసూలు చేయడమంటే దేశ ప్రగతిని అడ్డుకోవడమేనని అన్నారు. మోదీ పాలనలో పేదలు మరింత పేదలుగా మారే ప్రమాదం ఉందని చెప్పడానికి కేంద్రం తీసుకునే ఇలాంటి నిర్ణయాలే నిదర్శనమన్నారు. కార్పొరేట్లకు లాభం చేయడం కోసమే కేంద్రం చర్యలు కనిపిస్తున్నాయని, కేంద్రం ఎలాంటి వ్యాపారాలు చేయొద్దంటూనే బడా వ్యాపారుల కోసమే పని చేస్తున్నట్లు కనిపిస్తుందని దుయ్యబట్టారు.
మళ్లీ ఆ భారం పేదలపైనే పడుతుంది: పీక్ లోడ్ అవర్స్ పేరిట అదనపు ఛార్జీల వసూలు ప్రగతిశీల నిర్ణయం కాబోదని, ఛార్జీల పెంపు పరిశ్రమల మీద పడి పరోక్షంగా మళ్లీ పేద ప్రజలపైనే ఆ భారం పడుతుందని ఎట్టి పరిస్థితుల్లో పేదలపై భారం వేసే నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామని మంత్రి కేంద్రాన్ని హెచ్చరించారు. క్రమంగా పేద ప్రజలతో మమేకమైన సబ్సిడీ విద్యుత్‌ను వారికి దూరం చేయాలని కేంద్రం చూడటం, ఆ క్రమంలోనే తెలంగాణకు రావాల్సిన రుణాలు రాకుండా గతంలో అడ్డుకునే కుట్ర చేసి తెలంగాణ ప్రగతిని, అభివృద్ధిని ఆపాలని చూసిందన్నారు.
సీఎం కేసీఆర్ వారిని అడ్డుకుంటారు: పేదలకు ద్రోహం చేసి.. భారం వేసే ప్రతి చర్యను బీఆర్ఎస్ కచ్చితంగా అడ్డుకుని తీరుతుందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే గ్యాస్, డీజిల్ ధరలు పెరిగి కట్టెల పొయ్యిల రోజులు దాపురిస్తున్నాయని.. మళ్లీ విద్యుత్ ఛార్జీల పేరుతో మోయలేని భారం వేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కేంద్ర నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ అడ్డుకుంటారని తెలిపారు. మోదీ పాలనలో పేదల శాతం మరింత పెరిగిందని గుర్తు చేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా ఉచిత విద్యుత్‌లో ఎటువంటి మార్పులు ఉండదని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: