తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన భద్రకాళీ ఆలయానికి అంతర్జాతీయ ప్రమాణ సంస్థ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అందుతున్న సేవలకు గానూ ఈ గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఆలయ ప్రధాన అర్చకులు శేషు, ఆలయ ఈవో సునీతలకు హెచ్వైఎమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శివయ్య ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

రాష్ట్రంలో యాదాద్రి తర్వాత భద్రకాళీ ఆలయానికి ఐఎస్వో సర్టిఫికెట్ దక్కడం గొప్ప విషయమని ఆలయ ఈవో సునీత పేర్కొన్నారు. దేవాలయాన్ని అద్వితీయంగా నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, భద్రత, నిర్వహణ, విద్యుత్ సరఫరా విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఐఎస్వో సర్టిఫికెట్ సాధించిందని.. ఇదంతా సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని తెలిపారు. ఈ గుర్తింపుతో తనకు, అధికారులకు బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. ఐఎస్వో బృందం కోరిన విధంగా ఆలయ సమీపంలో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పురాతన, చారిత్రక కట్టడాల అభివృద్ధికి, పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో భద్రకాళీ బండ్ నగరానికి మరో మణిహారంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీచూడండి.. కొత్త రెవెన్యూ చట్టంపై రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం