ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు తమ పోరు ఆగదని నినదిస్తూ... వరంగల్లో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన ప్రదర్శన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మార్పీఎస్, ఉపాధ్యాయ సంఘాలు.. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నాయి. హన్మకొండ బస్టాండ్ నుంచి ఏకశిలాపార్క్ వరకు ఎద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించగా.... పోలీసులు అడ్డుకోవడానికి యత్నించారు. పోలీసులకు ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. అమరవీరుల స్థూపం వైపు ఉద్యోగులు పరుగెత్తుందుకు ప్రయత్నించగా... ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరస్పరం జరిగిన తోపులాటల్లో... పలువురు మహిళా ఉద్యోగుల చేతులకు గాయలయ్యాయి. కొందరి దుస్తులు చినిగిపోయాయి. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దుశ్చర్యలపై కార్మికులు మండిపడ్డారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే... మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా తమపై దౌర్జన్యం చేస్తారా అంటూ ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి: ఆరో రోజుకు చేరిన టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె