Self watering plant at ainavolu : ప్రతి రోజూ గుర్తుపెట్టుకుని మొక్కలకు నీళ్లు పోయాలంటే కష్టమే కదా! మొక్కలకు అవసరమైనప్పుడు నీళ్లు వాటంతటవే కుండీలో పడితే బాగుంటుంది కదా! సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ యువకుడు వినూత్న ఆవిష్కరణ చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన యాకర గణేశ్ ‘సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్’కు ప్రాణం పోశారు.
మొక్క ఉండే కుండీ కింద ఒక డబ్బా ఉంటుంది. మొక్కకు నీరు అవసరమని సెన్సర్లు గుర్తించినప్పుడు అందులోని నీళ్లు పైకి వచ్చి కుండీలో పడతాయి. ఈ సెన్సర్లు బ్యాటరీతో పనిచేస్తాయి. వారానికోసారి డబ్బాలో నీళ్లు మారిస్తే చాలు..మొక్కకు అవసరమైనప్పుడల్లా నీళ్లు అందుతాయి. కుండీ నిండిన వెంటనే నీళ్లు తిరిగి డబ్బాలోకి వెళ్లిపోతాయి.
ఒక్కోదానికి రూ.500 లోపే ఖర్చయిందని గణేశ్ తెలిపారు. ఆయన గతంలోనూ పలు ఆవిష్కరణలు చేశారు. ఇంటర్ వరకే చదివినా ఆయనలోని ఆవిష్కర్తను చూసి వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల వారు తమ ఇంక్యుబేషన్ కేంద్రంలో పనిచేసేందుకు అవకాశం కల్పించారు.
గతంలో 26 కంటే ఎక్కువ ఇన్నోవేషన్స్ నేను చేశాను. మనం తయారుచేసిన ఇన్నోవేషన్ సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను రూపొందిస్తున్నాను. ఇటీవల కాలంలో ఉన్న బిజీ షెడ్యుల్‌లో మొక్కలను పట్టించుకోవడం లేదు. అందుకే సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్‌ను తయారు చేశాం. మొక్కలోని వాటర్ తగ్గగానే... నీటిని తీసుకుంటుంది. తగినంత నీరు రాగానే ఆగిపోతుంది. ఇలాంటి వాటిని నర్సరీల్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. పంటల్లోనూ మోటార్ ఆన్, ఆఫ్‌కు కూడా ఉపయోగపడుతుంది.
-యాకర గణేశ్
ఇదీ చదవండి: Ameenpur Family suicide case updates : అమీన్పూర్ ఫ్యామిలీ సూసైడ్ కేసు.. ఇంకా వీడని మిస్టరీ