ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెరువుల్లో మత్స్యకారులు వేసిన చేప పిల్లలు పెరిగి పెద్దవయ్యాయి. వాటిని మే లోపే పూర్తిగా పట్టాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వర్షాకాలంలో చేతికి చిక్కకపోగా వరదలకు చెరువుల్లోనుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో మత్స్యకారులకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
చేపల చెరువులు ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 రిజర్వాయర్లు, 750 మత్స్యశాఖ చెరువులు, 4350 గ్రామపంచాయతీ చెరువులు, కుంటలుండగా వీటలో చేపల పెంపకం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 750 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 150 మహిళా మత్స్య సహకార సంఘాలున్నాయి. చేపల పెంపకంపై 1.50 లక్షల మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఏటా రూ.850 కోట్ల విలువ చేసే చేప పిల్లల్ని చెరువుల్లో ఉచితంగా వేస్తోంది. చెరువుల్లో మొత్తం లక్ష టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి వేసవిలో 60 శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా 40 శాతం స్థానికంగా విక్రయిస్తున్నారు.
10 శాతం చెరువుల్లోనే..
మార్చిలో మొదలు పెడితే జూన్ మొదటి వారం వరకు చేపల వేట కొనసాగుతుంది. ఇప్పటి వరకు 70 శాతం చెరువుల్లో చేపల వేట పూర్తి కావాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా కనీసం పది శాతం చెరువుల్లో చేపలను పట్టలేకపోయారు. ఒక చెరువులో చేపల్ని పట్టాలంటే కనీసం 50 మంది మత్స్యకారులు అవసరం ఉంటారు. ఈసారి చెరువుల్లో చేపల వేటకు దిగేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంలేదు. ఒక వేళ ఇచ్చినా ఇద్దరు ముగ్గురికే అనుమతి ఇస్తున్నారు. ఇలాగైతే చేపల్ని పట్టడం ఇబ్బందవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతి ఇవ్వాలి
ఉమ్మడి జిల్లాలో చేపల వేటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. కాలం దాటిపోతే చేపల వేట సాధ్యం కాదు. చేపల పెంపకానికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టాం. ఇప్పుడు చేపలను విక్రయించకుంటే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉంది. లాక్డౌన్ నిబంధనలను చేపల వేటలో కూడా పాటిస్తాం. ఈ విషయమై ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాం.
-బుస్సా మల్లేశం, ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు