కేవలం యాభై రూపాయలు చెల్లించి ఎంతైనా తినొచ్చు. మెతుకు మాత్రం మిగల్చొద్దు. మిగిలిస్తే... యాభై జరిమానా కట్టాల్సిందే. కట్టకపోతే లింగాల కేదారి అస్సలు ఊరుకోరు. మైకు పెట్టి మరీ...ఆహారం వృథా చేయకూడదని వచ్చిన వారందరకీ ముందే హెచ్చరిస్తారు.
వంద నుంచి నూట యాభై రూపాయలు పెడితే కానీ మంచి భోజనం దొరకదు. లింగాల కేదారి మాత్రం అరవై రూపాయలు తీసుకుని...పది రూపాయలు వెళ్లేముందు తిరిగి ఇచ్చేస్తాడు. భోజనం వృథా చేసిన వారి దగ్గర జరిమానా రూపంలో తీసుకున్న డబ్బులు అనాథలకు ఇచ్చేస్తుంటారు. ఆకలి బాధ తెలుసని, అందుకే అన్నాన్ని గౌరవించాలని అందరికీ చెబుతుంటారు. అన్నం పడేసే అధికారం ఎవ్వరికీ లేదంటారు.
కచ్చితమైన నిబంధనలు పాటిస్తూ.. కమ్మని భోజనం పెడుతున్న లింగాల కేదారిని నగరవాసులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. పనుల నిమిత్తం నగరానికి వచ్చినవాళ్లూ కడుపునిండా భోజనం చేసి వెళుతుంటారు.
ప్రస్తుతానికి డబ్బులు తీసుకుంటున్నా... భవిష్యత్తులో పూర్తిగా ఉచితంగా భోజనశాల నడపాలన్నదే తన కోరికని...దానిని కూడా త్వరలోనే ఆచరణలోకి తీసుకొస్తానంటున్నారు లింగాల కేదారి. ఆహార పదార్ధాలు వృథా చేయరాదంటూ ఓ మంచి ఆశయం కోసం పనిచేస్తున్న ఈ ఓరుగుల్లు వాసి.... అందరికి ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.