ఉత్తర తెలంగాణకు కీలకమైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి జ్వరపీడితుల తాకిడి ఎక్కువగా ఉంది. ఉదయం 6 గంటల నుంచి ఓపీ దగ్గర పడిగాపులు పడుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో ఉంటే కానీ వీరికి వైద్యం లభించని పరిస్థితి నెలకొంటోంది.
పెరుగుతోన్న జ్వరాల తీవ్రత
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ, వైద్య సేవలు నిలిచిపోవడం... అదే సమయంలో జ్వరం కేసులు ఎక్కువవడం వల్ల సామర్థ్యానికి మించి... రోగులు ఎంజీఎంలో చేరుతున్నారు. గత రెండు రోజుల్లోనే ఓపీ కేసులు 3,500 నుంచి 4,500 మేర పెరిగాయంటే... పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. దోమలు, అపరిశుభ్రత వల్ల జ్వరాల తీవ్రత పెరగుతోందని... రోగులకు వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది... అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్పారు.
రోగుల తాకిడి పెరిగే అవకాశం
పాము కాటు బాధితులు కూడా క్రమంగా ఎక్కువవుతున్నారు. గత వారంలో భారీ వర్షాలు కరువడం వల్ల చెరువులు, వాగులు నిండిపోయాయి. నేరుగా ఇళ్లల్లోకే పాములు వచ్చేస్తున్నాయి. పాము కాటుకు గురైనవారు ఎంజీఎంకు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ఇలా అన్ని రకాల బాధితులూ ఎంజీఎం రావడం వల్ల ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. వచ్చే నాలుగైదు రోజుల్లో రోగుల తాకిడి ఇంకా పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు చెపుతున్నారు.
ఇవీ చూడండి: మిషన్ భగీరథ నిర్మాణాలను పరిశీలించిన కేసీఆర్