ETV Bharat / state

కరోనా పరీక్ష ఆలస్యం.. అవుతోంది ప్రాణాంతకం! - COVID-19 second stage issues

రెండోదశలో కొవిడ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అప్పటి వరకూ బాగానే ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. పరిస్థితి విషమించే వరకూ ఇంట్లోనే ఉండి ఏదో ఒక వైద్యం పొందడం వల్ల ప్రాణాల మీదకొస్తోంది. ముప్పు తీవ్రమైందని తెలిసిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ పడకల కోసం తిరగడంలోనూ విలువైన సమయం వృథా అవుతోంది. నిర్ధరణ పరీక్షల ఫలితాలు మొదలుకొని పడకల లభ్యత వరకూ అన్ని స్థాయిల్లోనూ జాప్యం ప్రాణాంతకంగా మారుతోంది.

telangana corona effect news, telangana latest news today
కొవిడ్‌ నిర్ధరణ నుంచి పడకల లభ్యత వరకూ అన్నింటా జాప్యమే
author img

By

Published : May 2, 2021, 6:48 AM IST

Updated : May 2, 2021, 7:52 AM IST

తొలిదశతో పోల్చితే రెండోదశలో కొవిడ్‌ మరణాల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ప్రభుత్వం వెల్లడించిన బులెటిన్‌ ప్రకారమే.. ఈ మధ్య రోజూ యాభైకి పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఐసీయూలో వెంటిలేటర్‌పైన ఉండి చికిత్స పొందే వారి సంఖ్య కూడా పెరిగింది. హైదరాబాద్‌లోని గాంధీ, వరంగల్‌లోని ఎంజీఎం, నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి.. ఇలా అన్నింటిలోనూ పరిస్థితి విషమించాక వైద్యానికి వస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. మరణాల్లో ఎక్కువగా 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారుండగా.. 30 శాతం మంది 30-45 ఏళ్ల వారున్నట్లుగా తెలుస్తోంది.

జ్వరం తగ్గలేదు

నిజామాబాద్‌లో ఓ కుటుంబమంతా కొవిడ్‌ బారినపడింది. వారిలో ఒక వ్యక్తి(45) ఇంట్లోనే చికిత్స పొందుతూ.. కుటుంబ సభ్యుల బాగోగులూ చూశారు. తక్కిన వారి ఆరోగ్యం మెరుగైంది. ఆయనకు మాత్రం 6 రోజులైనా జ్వరం తగ్గలేదు. దగ్గు కూడా పెరిగింది. 2 రోజులకు పరిస్థితి విషమించింది. ఆయాసంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పటికే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉండడంతో.. వైద్యులు ఎంత శ్రమించినా ప్రాణాలు దక్కలేదు.

బిల్లు రూ.15 లక్షలైనా..

వరంగల్‌కు చెందిన మహిళ(56)కు స్వల్పంగా జ్వరం వచ్చింది. కొద్దిగా తలనొప్పి, నీరసం ఉన్నాయి. సాధారణ సమస్య అనుకొని పారాసెటమాల్‌ మాత్రలతో సరిపెట్టుకున్నారు. 3 రోజుల్లోనే జ్వరం 102 డిగ్రీలకు పెరిగింది. యాంటీజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ఆర్‌టీ పీసీఆర్‌ ఫలితం 3 రోజుల తర్వాత గానీ రాలేదు. పాజిటివ్‌ నిర్ధారణ అయ్యేటప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించింది. సమీప ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి ఆక్సిజన్‌ చికిత్స అందించారు. తర్వాత అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించమని స్థానిక వైద్యులు సూచించారు. రాజధానిలో పలు పెద్దాసుపత్రుల చుట్టూ తిరిగినా పడకలు లేవనే సమాధానమే వచ్చింది. ఓ ఆసుపత్రిలో చేరి 2 వారాలు ఐసీయూలో చికిత్స పొందితేగానీ కోలుకోలేదు. బిల్లు రూ.15 లక్షలైనా.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం ఊరటనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

పలు లక్షణాలతో అయోమయం
* కొవిడ్‌ తొలి దశలో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత కేవలం 20 శాతం మందిలో మాత్రమే కనిపించింది. అప్పుడు ప్రారంభ దశలో దగ్గు, జలుబు, జ్వరం వంటివి ప్రధాన లక్షణాలుగా ఉండేవి. లక్షణాలు కనిపించగానే.. అప్రమత్తమై వైద్యుని సంప్రదించేవాళ్లు.
* రెండోదశలో జ్వరం చాలా తక్కువమందిలో ప్రధాన లక్షణంగా కనిపిస్తోంది. 20-30 శాతం మందిలో కొద్దిగా తలనొప్పి, ఒళ్లునొప్పులు కనిపిస్తున్నాయి. కొందరిలో నీరసంగా ఉంటోంది. ఇలా లక్షణాలు భిన్నంగా ఉంటూండడం, వీటిపై అవగాహన కొరవడడంతో గందరగోళానికి గురై కొందరిలో జబ్బు ముదురుతోంది. జ్వరం బాగా పెరిగి, దగ్గు, జలుబు తీవ్రమైన దశలో వైద్యుని సంప్రదిస్తున్నారు. అప్పటికే ఆరోగ్యం విషమిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

బకెట్‌ నీళ్లను ఒకేసారి కుమ్మరించినట్లుగా...
మామూలుగా చెంబుతో నెమ్మది నెమ్మదిగా బకెట్‌ నీళ్లు కుమ్మరిస్తే ఎలాగుంటుంది? అదే బకెట్‌ నీళ్లను ఒకేసారి కుమ్మరిస్తే ఏమౌతుంది? రెండోదశలో వైరస్‌ ఉద్ధృతి కూడా అలాగే ఉంది. తొలిదశలో క్రమేణా కేసుల సంఖ్య పెరగగా.. రెండోదశలో వైరస్‌ ఒక్కసారిగా విరుచుకుపడుతోంది. 5-6 రోజుల్లోనే ఎక్కువమందికి వ్యాపిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్యంపై దృష్టిపెట్టి, కొందరు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తద్వారా ఆలస్యంగా ఆసుపత్రులకు వెళ్తున్నారు.

6వ రోజు తర్వాత ఇబ్బందులు మొదలు
వైరస్‌ తొలిదశలో 7-8 రోజుల తర్వాత తీవ్రంగా మారేది. ఇప్పుడు 5-6 రోజులకే తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. 6వ రోజు తర్వాత ఇబ్బందులు మొదలవుతున్నాయి. 5-10 రోజుల మధ్యనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ పెరిగిపోతోంది. శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ సమయంలో సరైన చికిత్స అందకపోతే.. ఒకట్రెండు రోజుల్లోనే పరిస్థితి విషమిస్తోంది. ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు.

కొంప ముంచుతున్న హ్యాపీ హైపాక్సియా
హఠాత్తుగా మరణాలు సంభవించడానికి మరో ప్రధాన కారణం హ్యాపీ హైపాక్సియా. అంటే రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గినట్లుగా తెలియకపోవడం. సాధారణంగా 94 శాతం కంటే తగ్గితే ఆయాసం వస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. హ్యాపీ హైపాక్సియా ఉన్న వారిలో అది 85 శాతానికి పడిపోయినా మామూలుగానే ఉంటున్నారు. తొలుత సాధారణ పనులకు ఇబ్బంది అవడం లేదు. తర్వాత ఇబ్బందులు మొదలవుతున్నాయి. ఎక్కువ దూరం నడవలేకపోవడం... మెట్లు ఎక్కితే ఆయాసం... మందులు వాడుతున్నా 5 రోజులైనా జ్వరం తగ్గకపోవడం వంటివి ప్రమాదకర సంకేతం. దీనికితోడు దగ్గు పెరిగిపోతుంటే వెంటనే వైద్యసేవలు పొందాలి. ఇటువంటి వారు హఠాన్మరణానికి గురవుతున్నారు. కారణం ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం.

ఆక్సిజన్‌ 85% కంటే తగ్గితే వైద్యం కష్టం
వయసు, దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా అత్యధికులు ఒకేసారి వైరస్‌ బారిన పడడం జాప్యానికి కారణమవుతోంది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ఫలితం రావడానికి మూణ్నాలుగు రోజులు పడుతోంది. ఈలోగా వైరస్‌ తన ప్రతాపం చూపిస్తోంది. చాలాచోట్ల పడకలు లభ్యం కావట్లేదు. బెడ్‌ కోసం రోగులను అంబులెన్సులో ఉంచుకొని, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈలోగా వ్యాధి ముదిరి ఒకట్రెండు రోజుల్లోనే మృత్యువాతపడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర సరిహద్దు రాష్ట్రాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా వైరస్‌ త్వరితగతిన వ్యాప్తి జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సరిహద్దు రాష్ట్రాల రోగులు చేరి చికిత్స పొందడం వల్ల కూడా పడకలు లభ్యత సమస్యగా మారింది. ఆక్సిజన్‌ శాతం 85 కంటే తగ్గిన తర్వాత ఆసుపత్రిలో చేరిన వారిలో అత్యధికులు ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు
మరణాలకు ప్రధాన కారణం ఆలస్యమే. తొలిదశతో పోల్చితే 30-45 ఏళ్లలోపు వయస్కుల్లో మరణాలు 10 శాతం పెరిగాయి. ఇప్పుడు మొత్తం కొవిడ్‌ మరణాల్లో ఈ వయస్సు వారు సుమారు 30శాతం వరకూ ఉంటారని అంచనా. ఇది ప్రమాదకరమైన సంకేతం. ప్రజలు ఏ లక్షణాన్నీ విస్మరించొద్దు. అతి చిన్నపాటి సమస్యనూ నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌ అని తేలగానే చికిత్స పొందాలి. పల్స్‌ ఆక్సిమీటర్‌తో ఎప్పటికప్పుడూ రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇంట్లో లేకపోతే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లైనా పరీక్షించుకోవాలి. 94 శాతం కంటే తగ్గుతున్నట్లుగా గుర్తిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స పొందాలి. ఎంత త్వరగా ఆయాసాన్ని గుర్తిస్తే మరణాలను అంత బాగా అరికట్టవచ్చు. ఒక్క నాలుగు వారాలు మరింత జాగ్రత్తగా ఉంటే.. ఈ మహమ్మారిని నివారించడం సాధ్యమవుతుంది.

- డాక్టర్‌ తిరునగరి వెంకట ఉదయకృష్ణ, సహాయ ఆచార్యులు, శ్వాసకోశ వైద్య విభాగం, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాల

ఇదీ చూడండి: కరోనా కట్టడికి బహుముఖ విధానాన్ని అనుసరించాలి: గవర్నర్

Last Updated : May 2, 2021, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.