ఎత్తిన జెండా, బిగించిన పిడికిలితో వచ్చే ఎన్నికల్లో ముందుకు సాగుతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala) అన్నారు. ప్రజల మద్దతుతో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ధర్మానికి, అధర్మానికి మధ్య సంగ్రామం జరగనుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు బుద్ధిచెబుతానని పేర్కొన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం(Huzurabad)లో పర్యటించిన ఈటల.. వరంగల్ పట్టణ జిల్లాలోని శంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు కార్యకర్తలు నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు. రాజీనామా ప్రకటన తర్వాత తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించారు. అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధిచెబుతామని ఈటల స్పష్టం చేశారు.
కొద్దిమంది వ్యక్తులు తెరాసకు తొత్తులుగా మారి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్(Huzurabad) నుంచే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని చెప్పారు. నియోజకవర్గంలో ధర్మమే గెలుస్తుందని తెలిపారు. అక్రమ సంపాదనతో ఓటర్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తామని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి : Etela: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రోడ్‌షో