Etela Rajendar Fires on CM KCR Government : రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుందని భారతీయ జనతా పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై తిరగబడినా.. అధికార పార్టీ నాయకులను ప్రశ్నించినా.. అక్రమ అరెస్టులు, పోలీసులతో దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు నిలదీస్తే.. పోలీసులతో దాడికి పాల్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఈటల.. పోలీసుల వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు తలపెట్టిన రేపటి బంద్‌కు మద్దతిస్తున్నామన్నారు.
RS Praveen Kumar meet KU Students: 'పేదలు చదువుకుంటే ప్రశ్నిస్తారనే భయం పాలకులకు పట్టుకుంది'
ఈ సందర్భంగా విద్యార్థుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేయూ వీసీని భర్తరఫ్ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని తెలిపిన ఆయన.. కేసీఆర్ పాలనలో విశ్వవిద్యాలయాలు నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉద్యమం మొదలైందని వ్యాఖ్యానించారు. అన్ని విద్యార్థి సంఘాలు ఒక్కటిగా కలిసి రావడం శుభ పరిణామం అని స్పష్టం చేశారు.
KU students protest: కేయూలో విద్యార్థుల ఆందోళన.. వీసీ ఆదేశాలపై ఆగ్రహం
విద్యార్థుల విషయంలో అనుచితంగా ప్రవర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలి. వీసీ వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. వీసీ తీరును నిరసిస్తూ రేపు విద్యార్థులు తలపెట్టిన బంద్‌కు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకమైన విశ్వవిద్యాలయాలను కేసీఆర్ సర్కార్ అణచివేస్తోంది. - ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది..: టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) పార్టీ ఆరంభం సమయంలో రూ.లక్ష కూడా లేని కేసీఆర్‌కు.. నేడు రూ.లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఈటల సవాల్ విసిరారు. తొమ్మిదేళ్లకు ముందు కేసీఆర్ మాటలు.. తొమ్మిదేళ్ల తర్వాత కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును కేసీఆర్ సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనంలో ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్, దళితబంధు వంటి పథకాల పేరుతో నిరుపేదలను మోసం చేస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని ఈటల అభిప్రాయపడ్డారు.
కేయూలో సభకు నిరాకరించిన వీసీ.. భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
మరోవైపు.. మూసివేసిన వసతి గృహాలను తెరవాలని డిమాండ్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనాన్ని ముట్టడించాయి. గత 20 రోజులుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో వసతి గృహాలు మూసివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. మూసేసిన వసతి గృహాలను తెరవడంతో పాటు మూడో సంవత్సరం న్యాయ విద్య పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వీసీ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.