స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను జనవరిలోపు పూర్తి చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కుడా కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పురపాలక, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్ ఇంజినీర్లతో చర్చించారు.
అంకితభావంతో పనిచేసి పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. పూర్తయిన వాటికి సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు. వరదల వల్ల పాడైపోయిన రోడ్లు, కాలువల మరమ్మతు పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న కూడళ్ల సుందరీకరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.