దేశంలో హృద్రోగ సమస్యలతో మరణించేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. మారిన జీవనశైలి మనుషులను, గుండె జబ్బుల బారిన పడేలా చేస్తోంది. ఉరుకుల పరుగుల జీవనం.. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మద్యపానం, తదితర కారణాలతో చాలామంది గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుండెపోటు వచ్చి మరణించిన వారిలో సకాలంలో వైద్యసేవలు అందక ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువగా ఉంటున్నారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా అప్పటివరకూ మనతో ఉన్నవారు క్షణాల్లో విగతజీవిగా మారిపోతున్నారు. ప్రతీ సంవత్సరం లక్ష జనాభాలో 4 వేల మంది సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో మరణిస్తున్నట్లు ఓ అంచనా.
సీపీఆర్‌పై అవగాహన..
గుండె కొట్టుకోవడం ఆగిపోయి.. కుప్పకూలిన వారికి సకాలంలో చేతులతో ఛాతి మర్ధన (సీపీఆర్) చేస్తే వారిని కాపాడుకునే అవకాశం ఉందని శాస్త్త్రీయ అధ్యయనంలో తేలింది. అయితే అలాంటి ప్రథమ చికిత్స పట్ల చాలా మందికి అవగాహన ఉండట్లేదు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు.. రామక శ్రీనివాస్ తన వద్దకు వచ్చిన రోగుల కుటుంబీకులకు సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర సమాయాల్లో అనుసరించాల్సిన విధానం పట్ల శిక్షణ ఇస్తున్నారు.
మనిషి కుప్పకూలినప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా.. అతివేగంగా ఛాతి మధ్యలో నిరంతరంగా.. నిమిషానికి వంద నుంచి 120 మార్లు వేగంతో మర్దన చేయాల్సి ఉంటుంది. ఏఈడీ పరికరం అందుబాటులో ఉంటే ఉపయోగించవచ్చు. హస్తాలతో సీపీఆర్ చేస్తే మనిషి ప్రాణం పోకుండా కాపాడుతుందని శ్రీనివాస్ తెలిపారు.
సీపీఆర్ ఛాలెంజ్ ప్రచారం
కేవలం తన వద్దకు వచ్చే రోగులకు మాత్రమే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, హైదరాబాద్ వంటి నగరాల్లో అనేక అవగాహన కార్యక్రమాలను శ్రీనివాస్ చేపట్టారు. దాదాపు 20 వేల మందికి ప్రత్యక్షంగా హస్తాలతో మర్దన ప్రక్రియ విధానంపై శిక్షణ ఇచ్చారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో 4 వేల మందికి ఒకేసారి నేర్పించటం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. తాను ఒకరికి నేర్పిస్తే ఆ ఒక్కరూ మరో పదిమందికి నేర్పించడమే లక్ష్యంగా.. నేషనల్ సీపీఆర్ ఛాలెంజ్ క్యాంపేన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. సీపీఆర్ విధానంపై ప్రభుత్వం, వైద్యులు ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని.. అప్పుడే ఈ మరణాలు తగ్గుతాయని శ్రీనివాస్ పేర్కొన్నారు.
5 నిమిషాల్లో నేర్చుకోవచ్చు..
హస్తాలతో మర్దన ప్రకియను నేర్చుకోవడానికి రోజల తరబడి శిక్షణ కూడా అక్కర్లేదు. కేవలం ఐదే నిమిషాల్లో ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది నేర్చుకుంటే మన కుటుంబసభ్యులు, మిత్రుల ప్రాణాలు కాపాడిన వారౌతాం. గుండెపోటుతో కుప్పకూలిన మనిషిని కాపాడితే.. మళ్లీ ఆ వ్యక్తికి పునర్జన్మను ఇచ్చినట్లే అని.. అది మన చేతుల్లోనే ఉందంటున్న రామక శ్రీనివాస్ వైద్యులకే ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చూడండి:వచ్చే ఏడాది బ్యాంకుల సెలవులు ఇవే!