శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు ప్రజలను కరోనా వ్యాధి నుంచి కాపాడటం తమ బాధ్యతని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వలసకూలీల కోసం ఏర్పాటు చేసిన కరోనా నిర్ధరణ పరీక్షలను శనివారం ప్రారంభించారు. రాంపూర్ పారిశ్రామిక వాడలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకూలీలు పనులు చేస్తుంటారు. కరోనా నియంత్రణలో భాగంగా ఇండస్ట్రియల్ ఏరియాల్లో విధులు నిర్వర్తిస్తున్న వలస కూలీల ఆరోగ్యంపై ధర్మసాగర్ పోలీసులు దృష్టి సారించారు. జిల్లా వైద్యావిభాగం సహకారంతో సుమారు 200 మందికి పైగా వలస కూలీలకు పరీక్షలు నిర్వహించారు.
వలస కూలీలకు మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ ప్రతినిధి డా.కృష్ణారావు, కాజీపేట ఏసీపీ రవీందర్ కుమార్, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, మడికొండ ఇన్స్పెక్టర్ రవికుమార్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శైలజతో పాటు ఇతర పోలీసు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Fuel Price: చుక్కలు చూపిస్తోన్న చమురు ధరలు