శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామివారి జాతర నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధ చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జనవరి 13,14,15 తేదీల్లో జరిగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కోటి రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన టాయిలెట్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డిని, శానిటైజేషన్‌కు అంగీకరించిన మేయర్ గుండా ప్రకాశ్రావుని మంత్రి అభినందించారు. భక్తులకు అన్నదానం, వసతుల కల్పనపై ఆయాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
నిబంధనలు తప్పనిసరి
ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులైనా సరే కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని అన్నారు. ఆలయ పరిసరాల్లో నిబంధనలు అమలయ్యేలా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. వీఐపీలకు, దాతలకు ప్రత్యేక పాసులు జారీ చేసి, నిర్ణీత సమయాల్లో దర్శనాలు చేయించాలన్నారు. జాతర కోసం ఆర్టీసీ అదనంగా 25 బస్సులు నడుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. సామాజికదూరం, మాస్కులు, శానిటైజర్లు భక్తులకు అందుబాటులో ఉంచుతామని జిల్లా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు వెల్లడించారు.
స్వామివారిని దర్శించుకున్న మంత్రి
మల్లికార్జున స్వామివారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, సిబ్బంది, పూజారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. జాతర ఏర్పాట్లపై ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.