ఉమ్మడి వరంగల్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజూ మూడెంకెల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలకు తమ ప్రాంతాల్లో కేసులు ఎలా పెరుగుతున్నాయో తెలియాలని, వీటితోపాటు ఎక్కడెక్కడ పరీక్షలు చేపడుతున్నారనే అవగాహన రావాలని ప్రభుత్వం కరోనా బులిటెన్‌లో అనేక రకాల వివరాలు పొందుపరుస్తోంది. జిల్లాల వారీగా రోజురోజు నమోదైన కేసుల గణాంకాలే కాకుండా వారం నుంచి ఎలా నిర్ధరణ అవుతున్నాయనే లెక్కలను అందిస్తోంది.
కొన్ని చోట్ల లాక్‌డౌన్
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సమయంలో కరోనా కేసుల సంఖ్య పెరగలేదు. జనం ఇళ్లలోనే ఉండడంతో వైరస్ విజృంభించకుండా ఉంది. ఈ క్రమంలో తమ ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరగడంతో వివిధ వర్గాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. అలా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాలను నిబంధనల ప్రకారం మూసేస్తున్నారు.
* పరకాలలో వారం నుంచి పది రోజుల పాటు వివిధ రంగాల వారు స్వచ్ఛందంగా దశలవారీగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. ఈనెల 5 వరకు హోటళ్లు బంద్ ఉన్నాయి.
* మహబూబాబాద్‌లో ఆగస్టు ఒకటి నుంచి 16 వరకు దస్తావేజుల లేఖరులు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు.
* ఖానాపురంలో ఈ నెల 5 వరకు మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాలు మూసేస్తున్నారు.
* మడికొండలో నెల రోజులు లాక్‌డౌన్ పాటించేందుకు నిర్ణయించారు.
* కమలాపూర్‌లో ఉదయం ఆరు నుంచి పది వరకే దుకాణాలు తెరిచి పెడుతున్నారు.
* జఫర్‌గడ్‌లో ఉదయం సాయంత్రం పరిమిత సమయంలో దుకాణాలు తెరిచి మళ్లీ మూసేస్తున్నారు.
* డోర్నకల్‌లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకే దుకాణాలు నడుపుతున్నారు.
ఇంకా నిర్లక్ష్యం
కొన్ని చోట్ల స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటిస్తూ వైరస్ వ్యాప్తి కాకుండా నివారణ చర్యలు తీసుకుంటుంటే మరికొందరు ఇప్పటికీ అప్రమత్తంగా ఉండడం లేదు. బయటకెళ్లినప్పుడు మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకుండా గుమిగూడడం, అవసరం లేకున్నా రోడ్లపై తిరగడం లాంటివి చేస్తూ వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఆగస్టు ప్రజలంతా ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.