అదో కూరగాయల మార్కెట్. అప్పటి వరకు కూరగాయలు అమ్మే మహిళలంతా మధ్యాహ్నం మూడయ్యిందంటే చాలు పుస్తకాలు పట్టుకుంటారు. శ్రద్ధగా చదువు మొదలుపెడతారు. అరవై ఏళ్ల బామ్మలు సైతం పలకా బలపం పట్టి ఓనమాలు దిద్దుతారు. హనుమకొండ బాలసముద్రంలోని కూరగాయల మార్కెట్లో నడుస్తోంది ఈ అంగడి బడి. ప్రేరణ అనే ఫౌండేషన్ వాళ్లు గత మూడు నెలలుగా నడిపిస్తున్నారు.
బోర్డులు ఉండవు
కరోనా సమయంలో హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలో మురికివాడ పిల్లల కోసం బస్తీ బడి నెలకొల్పారు. వారికి రోజూ భోజనం పెడుతూ వందలాది మంది చిన్నారులకు చదువు నేర్పారు. ఇప్పుడు వయోజన విద్యపై దృష్టిసారించారు. కూరగాయల మార్కెట్లో అంగడి బడిని ఏర్పాటు చేశారు. బడి అంటే ప్రత్యేకించి బల్లలు, కుర్చీలు, బోర్డులు ఏమీ ఉండవు.
రోజు రెండు గంటలపాటు
మార్కెట్టులో 70 మంది వరకు మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మంది నిరక్ష్యరాస్యులే. మూడు నెలలుగా ప్రతి రోజూ మధ్యాహ్నం మూడు నుంచి అయిదు గంటల వరకు మహిళా వ్యాపారులకు చదువు చెబుతున్నారు. ఫౌండేషన్ వాళ్లు పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్నులు మహిళలకు అందించి చదువు చెబుతున్నారు. కొందరు మార్కెట్లో చదువుకున్న మహిళలు ఉంటే తోటి వారితో అక్షరాలు దిద్దిస్తున్నారు.
చదువుకోవాలన్న ఆశ కలిగించారు
'మధ్యాహ్నం మేము ఫ్రీగా ఉన్న టైమ్‌లో వచ్చి మాకు చదువు చెబుతున్నారు. కస్టమర్స్ లేని సమయంలో మేము మంచిగా చదువుకో గలుగుతున్నాం. ఇప్పుడు మంచిగా మాట్లాడటం తెలిసింది. చదువుకోవాలన్న ఆశ కలుగుతోంది. ఇప్పుడు చదువుకోవాలన్న ఆశ కలిగించిన సార్లకు రుణపడి ఉంటాం' - యుమున, కూరగాయలు అమ్మే మహిళ
'సార్ వాళ్లు వచ్చి రోజుకు గంటసేపు చదువు చెబుతున్నారు. అఆలు నేర్పిస్తున్నారు. మంచి జ్ఞానం నేర్పిస్తున్నారు. చదువుతున్నాం రాసుకుంటున్నాం.' - సుభద్ర, కూరగాయలు అమ్మే మహిళ
కూరగాయలు అమ్ముతూనే..
65 ఏళ్ల బుచ్చమ్మ నిరక్షరాస్యురాలు. ఇప్పుడు ఆమె తన పేరును చక్కగా రాయడం నేర్చుకొంది. తొమ్మిదో తరగతి వరకు చదివిన కావ్య ఒకవైపు కూరగాయలు అమ్ముతూనే మరో వైపు తన పక్క కొట్టులో ఉండే లలితమ్మతో అక్షరాలు దిద్దిస్తోంది. మహిళలు వేమన, సుమతి శతకాల్లోని పద్యాలు కూడా బాగా చెబుతున్నారు.
అందరికీ విద్య అందరిది బాధ్యత
'ప్రేరణ పౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కమ్యూనిటీ ఎడ్యుకేషన్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్లు తీరిక సమయంలో అక్ష్యరాస్యత, పర్యావరణం, ఆరోగ్యం, కుటుంబం, చదువు దాని విలువ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కూరగాయల మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ల ద్వారా వాళ్లకే విద్య అనే నినాదం ద్వారా డ్రాపర్స్ ద్వారా పాఠాలు చెప్పిస్తున్నాం. వాళ్లకు కావల్సిన పలకలు, చాక్‌పీస్‌లు, స్టేషనరీ అంత ఇస్తున్నాం. అందరికీ విద్య అందరిది బాధ్యత అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం '- ఉపేందర్ రెడ్డి, ప్రేరణ ఫౌండేషన్ నిర్వాహకుడు
చదువు వచ్చిన మహిళలకు నవలలు, అనేక రకాల పుస్తకాలను అందిస్తుండడంతో వారు వెంటనే చదివేస్తూ మరో పుస్తకం ఇవ్వాలని అడుగుతున్నారట. ఈ కూరగాయల బడి ద్వారా మూడు నెలల్లో ఎంతో మందిని అక్షరాస్యులను చేసి వయోజన విద్యకు ఊపిరిలూదుతున్నారు.
ఇదీ చదవండి : పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటివరకు ఎంత జమ అయిందంటే..