ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 21న ఓరుగల్లులో పర్యటించనున్నారు. సకల హంగులు, బహుళ అంతస్తులతో అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ఒకే చోట నిర్మితమైన కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్ కేంద్ర కారాగార ప్రాంతంలో నిర్మించతలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేసీఆర్ అంకురార్పణ చేయనున్నారు. 54 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో అధునాతన ఆసుపత్రి నిర్మించాలని సీఎం సంకల్పించారు. అందుకు అనుగుణంగా జైలు భవనాలను అధికారులు కూల్చేశారు.
యాదాద్రిలో పనుల పరిశీలన
వరంగల్ పర్యటన ముగించుకుని తిరుగుపయనంలో ముఖ్యమంత్రి యాదాద్రిలో ఆగనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి కొన్ని అంశాలపై అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసి ఆలయాన్ని ప్రారంభించాలని సీఎం సంకల్పించారు. అందుకు అనుగుణంగా పనులు త్వరితగతిన పూర్తిచేసేలా యంత్రాంగానికి పలు సూచనలు చేయనున్నారు.
వాసాలమర్రి సర్పంచ్‌కు హామీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 22న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటించనున్నారు. వాసాలమర్రి సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తానని ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటానని తెలిపారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయిస్తానని సర్పంచ్‌కు హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే సునీత, కలెక్టర్ పమేలా సత్పతి... వాసాలమర్రిలో పర్యటించారు. సీఎం బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి? సహపంక్తి భోజనం చేసే స్థలాలను పరిశీలించారు.
ఇదీ చదవండి: CM KCR: సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్