CJI NV Ramana tour: వరంగల్లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు సీజేఐ జస్టిస్ఎన్వీ రమణ.. కాకతీయ కళావైభవం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న సీజేేఐకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ కవిత జిల్లా యంత్రాంగం, ఎమ్మెల్యే సీతక్క ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శాలువాతో సత్కరించి.. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో రామలింగేశ్వర స్వామిని సీజేఐ దంపతులు దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప విశిష్టత.. శిల్ప కళా సంపద గురించి ఆలయ గైడ్.. సీజేఐకి వివరించారు.
విద్యార్థుల వినూత్న స్వాగతం
cji at school:రామప్పకు వచ్చిన సీజేఐకి అంతకముందు స్థానిక పాఠశాల విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలికారు. మహిళా న్యాయవాదుల సదస్సులో మాతృభాషపై మీరిచ్చిన ప్రసంగం.. మాకెంతో స్ఫూర్తినిచ్చిందంటూ రాసిన ఫ్లెక్సీతో ఆహ్వానించారు. విద్యార్థుల్లో భరతమాత వేషధారణతో విద్యార్ధిని అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆలయ సందర్శన అనంతరం.. జస్టిస్ఎన్వీ రమణ వీరితో కాసేపు ముచ్చటించారు. రామప్ప పర్యటన అనంతరం హనుమకొండకు వచ్చిన సీజేఐకి.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయవాదులు, అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
నూతన కోర్టు భవనాల ప్రారంభం
CJI second day tour: రెండోరోజు పర్యటనలో భాగంగా జస్టిస్ఎన్వీ రమణ ఇవాళ ఉదయం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హనుమకొండలో కొత్తగా నిర్మించిన పది కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. నిర్మాణపరంగానే కాకుండా.. కక్షిదారుల సౌకర్యార్ధం ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టేలా ఈ కోర్టు భవనాలను నిర్మించారు. నూతన భవనంతోపాటు.. సీనియర్ సివిల్ న్యాయస్ధాన హాల్ను పోక్సో కోర్టుగా మార్చారు. లైంగిక దాడుల కేసుల్లో విచారణకు హాజరయ్యే బాధితులు, వారి కుటుంబసభ్యులు ఎవరికీ కనిపించకుండా.. ప్రత్యేక ద్వారాన్ని, విచారణ కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో పచ్చదనం పెంచి.. ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. మరోవైపు సీజేఐ రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్లు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తామని వెల్లడించారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వరంగల్ పర్యటన ముగించుకుని ఈ మధ్యాహ్నం హైదరాబాద్కు వెళ్తారు.