"బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్, బాక్స్, బాటిల్" పై విస్తృత ప్రచారం చేయాలని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వరంగల్ మహానగరంలో ప్లాస్టిక్ నియంత్రణ చేపట్టే దిశగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతి వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు విధిగా బట్టతో చేసిన చేతి సంచిని తీసుకుపోవాలని... మాంసం విక్రయ కేంద్రాల వద్దకు వెళ్లినప్పుడు బాక్సులు పట్టుకెళ్లాలని సూచించారు.
వీటిపై ప్రజలకు అవగాహన వచ్చే విధంగా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటింటికి చెత్త సేకరించే ఆటోల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు ప్లాస్టిక్ రైడ్ టీంను కమిషనర్ నియమించారు. నగరంలో ప్లాస్టిక్‌ను నిషేధించినట్టు తెలిపిన కమిషనర్... ప్లాస్టిక్ నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగించిన వారి మీద క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.