BJP Unemployment March: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన 'నిరుద్యోగ మార్చ్'తో ఓరుగల్లు కాషాయమమైంది. దీనికి భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు సహా ముఖ్య నేతలు నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కూడలి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు.
పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం సహా నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేపట్టాలనినాయకులు, శ్రేణులు నినదించారు. పేపర్ లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని అన్నారు. తొలుత ఓరుగల్లులో చేపట్టిన నిరుద్యోగ మార్చ్..ఆ తర్వాత అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు.
ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్... అన్ని పేపర్ల లీకులకూ తానే కారణమని చెబుతున్నారని ఆరోపించారు. ప్రజల సమక్షంలో సమాధానం చెప్పక తప్పదని అన్నారు. ఇంట్లో కార్యక్రమం ఉందని చెప్పినా అరెస్టు చేశారని వివరించారు. కేసీఆర్ ఇంట్లో వారంతా దందాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీలో తప్పు లేకుంటే సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తప్పు చేయకపోయినా ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి బయటకు పంపారని బండి సంజయ్ ఆరోపించారు. కుమారుడు, కుమార్తెను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసం బీజేపీ పోరాడుతోందని స్పష్టం చేశారు. ఈడీ విచారణ అంటే చాలు.. అనేక సాకులు చెబుతారని విమర్శించారు. 30 లక్షల మంది యువత ఇబ్బంది పడితే సీఎం ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదని బండి సంజయ్ ఆక్షేపించారు.
ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే నిరుద్యోగ మార్చ్: రైతులు, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా.. కేసీఆర్ స్పందించరని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ముఖ్యమంత్రి యువతను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మూర్ఖత్వ పాలన కోసమా తెలంగాణ సాధించుకున్నామని యువత ప్రశ్నిస్తోందని అన్నారు. ఎన్నికలు వస్తేనే ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ వివరించారు.
చేతులు దులుపుకునేందుకు ప్రయత్నం: ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ రావాలని.. క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21న పాలమూరులో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని అన్నారు. ఆ తరువాత ఖమ్మంలోనూ నిర్వహించనున్నట్లు తెలిపారు. సిట్ విచారణ చేసి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్, నయీం, ఎమ్మెల్యేల వివాదం, మియాపూర్ భూములపై సిట్ విచారణ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు.
సీఎం రాజీనామా చేయాలి: ఇన్ని జరుగుతున్నా కేసీఆర్ టీఎస్‌పీఎస్సీకే వత్తాసు పలుకుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఖాళీ ఉద్యోగాల భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు. టీఎస్‌పీఎస్సీ కేసులో సీఎం రాజీనామా చేయాలన్నారు. ఈకేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత యువతకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ పేర్కొన్నారు.
"కేసీఆర్ కుటుంబానికో న్యాయం.. ఇతర ఎమ్మెల్యేలకో న్యాయమా?. యువత భవిష్యత్ నాశనం అవుతుంటే సీఎం ఒక్కమాట మాట్లాడలేదు. లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. 80 వేల ఉద్యోగాలిస్తామని చెప్పి ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. కేంద్రం నిర్వహించే ఏ పరీక్షలోనూ తప్పులు జరగవు. ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్ విచారణకు ఒప్పుకోం. సీఎం కేసీఆర్ గతంలో ఎప్పుడైనా అంబేడ్కర్ జయంతి నిర్వహించారా? త్వరలో హైదరాబాద్‌లోనూ నిరుద్యోగ మార్చ్ భారీగా నిర్వహిస్తాం." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కుటుంబ కోసం మాత్రమే ముఖ్యమంత్రి ఆలోచిస్తారని విమర్శించారు. విద్యార్థులు సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. పేపర్ లీకైన పరీక్షలు వెంటనే నిర్వహించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: Kishan Reddy: 'అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు'
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై తెలుగులో కూడా CAPF కానిస్టేబుల్ పరీక్ష!