Balagam Singer suffering from kidney disease: తోడుగా మా తోడుండీ.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కడెళ్లినావు కొమురయ్యా.. నీ జ్ఞాపకాలు మరవమయ్యో కొమురయ్యా.. అంటూ ప్రేక్షకుల హృదయాల్లో దుఖ:రసం పొంగించారు వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. ఊరూరు తిరుగుతూ కథలు చెప్పుకుంటూ పొట్ట పోసుకుంటున్న ఈ దంపతులు బలగం సినిమాలో నటించి, పాట పాడారు.
ఆ సమయంలో ఒకరోజు కండ్లు తిరిగి పడిపోవడంతో మొగిలయ్య చెయ్యి విరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే.. రెండు కిడ్నీలు పాడైనట్టు తెలిసింది. డయాలసిస్ చేయించడం తప్పనిసరన్న డాక్టర్ల సూచనతో వారానికి 3రోజులు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. డయాలసిస్ చేసే క్రమంలో రక్తం ఎక్కించేందుకు 11 చోట్ల రంధ్రాలు చేయాల్ని వచ్చింది. చివరగా ఛాతీ భాగం నుంచి రక్తం ఎక్కిస్తున్నారు. మొగిలయ్య డయాలసిస్ కోసం వారానికి 3సార్లు దుగ్గొండి నుంచి వరంగల్ సంరక్ష ఆసుపత్రికి వచ్చిపోతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్ చేస్తున్నారు.
"బలగం సినిమాలో లాస్ట్ పాట పాడింది మేమిద్దరమే.. వేణు సార్, దిల్ రాజు సార్ దయ వల్ల ప్రపంచానికి పరిచయం అయ్యాం.. వారి సాయంతో ప్రస్తుతం బుక్కెడు అన్నం తింటున్నాం. కానీ ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నా రెండు కిడ్నిలు చెడుపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. దాతలు ముందుకు వచ్చి నాకు ఆర్ధిక సాయం చేస్తారని కోరుకుంటున్నాను". పస్తం మొగిలయ్య, బలగం సినిమా గాయకుడు
భార్య కొమురమ్మ అన్నీ తానై భర్త వైద్యం కోసం ఆసుపత్రులకు తీసుకువెళ్తోంది. రెండు కిడ్నీలు చెడిపోయిన మొగిలయ్యకు బీపీ, షుగర్ స్థాయిలు పెరగడంతో కంటి చూపు దెబ్బతిన్నది. క్రమంగా మిగతా అవయవాలకు ఈ దుష్ప్రభావం విస్తరిస్తోంది. ఆ కుటుంబం ఇప్పుడు పుట్టెడు దుఖంతో కుమిలిపోతున్నది. నిస్సహాయ స్థితిలో ఉన్న దంపతులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వైద్య ఖర్చులకు ప్రతీనెలా 20 వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. ఇప్పటి వరకు 8 లక్షల రూపాయలు ఖర్చయినట్లు కొమురమ్మ తెలిపింది. సహృదయంతో ఎవరైనా స్పందించి తమను ఆర్థికంగా అదుకోవాలని కొమురమ్మ వేడుకుంటోంది.
"కరోనా సమయంలో ఆయన కిడ్నీలు చెడుపోయాయి. ఆ తరువాత కంటి చూపు పోయింది. ఇప్పుడు షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్నారు. మా పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. బిడ్డలారా దయతలచి మాకు కొద్దిగా సాయం చేస్తారని కోరుతున్నాం". కొమురమ్మ, బలగం సినిమా గాయకురాలు
ఇవీ చదవండి:
'బలగం' సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
దిల్‌రాజుకు డబుల్ ప్రాఫిట్!.. 'బలగం' మొదటి వారం వసూళ్లు ఎంతంటే?
13 ఏళ్లకే ఆగిన చిన్నారి గుండె.. చిన్నీ కళ్లు తెరువంటూ సీపీఆర్ చేసిన తండ్రి.. అయినా...