తినేందుకు తిండి దొరక్క ప్రపంచవ్యాప్తంగా రోజూ ఎంతో మంది చనిపోతున్నారు. ఆకలి బాధ ఎలాగుటుందో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. లాక్డౌన్ వల్ల పని కరవై, పట్టెడన్నం కూడా దొరక్క ఇబ్బందులు పడుతోన్న నిర్భాగ్యుల పాలిట అమ్మలా మారి ఆకలి తీరుస్తోంది వరంగల్ నగరపాలక సంస్ధ. మధ్యాహ్నమే కాదు... ఇప్పుడు రాత్రిపూట సైతం నిరుపేదలకు ఉచితంగా భోజనం అందిస్తోంది.
కరోనా వైరస్ నియంత్రణ కోసం లాక్డౌన్ విధించిన కారణంగా చాలామంది పనికి దూరమయ్యారు. చేయడానికి పని లేదు... చేతిలో ఆదాయమూ లేదు. ముఖ్యంగా నిరుపేదలు, వలస కార్మికులు, యాచకుల పరిస్ధితి మరీ దయనీయంగా మారింది. ఆకలితో ఎవరూ పస్తులుండకూడదన్న ఉద్దేశ్యంతో నగరపాలక సంస్ధ అధికారులు... రెండు పూటలా ఉచితంగా భోజనాలు అందిస్తున్నారు. గతంలో 5 రూపాయలు తీసుకోగా.... ఈ విప్తతు వేళ ఉచితంగానే నగరపరిధిలోని 9 అన్నపూర్ణ కేంద్రాల్లో ప్రతిరోజు పదివేల మంది ఆకలి తీరుస్తున్నారు.
ఆటోడ్రైవర్లు, హమాలీలు, వలస కూలీలు, పారిశుద్య కార్మికుల పాలిట ఈ అన్నపూర్ణ కేంద్రాలు వరంలా మారాయి. శనివారం వరకు కేవలం మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం సమకూర్చగా... ఇప్పుడు రాత్రిపూట కూడా ప్రభుత్వాసుపత్రుల వద్ద అన్నార్థులకు ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. వలస కూలీలు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు... వరంగల్ నగర పాలక సంస్ధ చేపట్టిన ఉచిత భోజనంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆకలితో ఎవరూ పస్తులుండకూడదన్న ఉద్దేశ్యంతో రెండు పూటలా భోజనం ఉచితంగా అందిస్తున్నట్లు వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్ రావ్ తెలిపారు. క్రెడాయ్ సహకారంతో మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 10,000 మందికి ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. అన్నపూర్ణ కేంద్రానికి రాలేని వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని... చరవాణీ ద్వారా సమాచారమిస్తే, వారి దగ్గరికి వెళ్లి భోజనం సరఫరా చేస్తున్నామని తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా ఎక్కడా హోటళ్లు లేకపోవడం... తప్పనిసరి పరిస్ధితుల్లో బయటకి వచ్చేవారికి.. అన్నపూర్ణ భోజనం వరంలా మారింది. కడుపునిండా భోజనం పెట్టడంతో ఆకలి తీరిన నిర్భాగ్యులు... ఆనందంతో తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. త్వరలో మరికొన్ని కేంద్రాల వద్దా రాత్రి పూట భోజనం ఏర్పాటు చేసేందుకు గ్రేటర్ వరంగల్ అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి : కరోనాపై కదనంలో.. అమ్మ అలుపెరగని పోరాటం