ఆమె ఇల్లే నందనవనం... భూతదయకు తానో నిదర్శనం - animal lover anithareddy
మొక్కలతో ముచ్చటిస్తుంది. పిట్టలతో దోబూచులాడుతుంది. ఉడుతలతో కాలక్షేపం చేస్తుంది. వందల మొక్కలతో సావాసం చేస్తూ... మరెన్నో మూగజీవాలను మచ్చిక చేసుకుంది. ఇదేదో పొడుపు కథ కాదండీ. హన్మకొండకు చెందిన అనితారెడ్డి వ్యాపకం. వందల మొక్కలు పెంచుతూ... పక్షులకు ఇంట్లోనే గూళ్లు కడుతూ... ఉడుతలతో స్నేహం చేస్తూ... ప్రకృతిపై ప్రేమను... జీవాలపై భూతదయను చాటుకుంటున్నారు.

ఇంట్లో కాస్త స్ధలం ఉంటే చాలు... ఇంకో గది కడదాం. మరో వాటా నిర్మిద్దాం అని చాలామంది అనుకుంటారు. హన్మకొండకు చెందిన అనితారెడ్డి మాత్రం ఇందుకు భిన్నం. ఇంటి చుట్టూ... చిన్నాపెద్దా కలిపి దాదాపు మూడు వందల మొక్కలను పెంచుతూ... ఇంటినే ఓ నందనవనంలా మార్చేశారు. అనితారెడ్డి... మొక్కలతోనే కాదు మూగజీవాలతోనూ స్నేహం చేస్తుంటుంది.
ఉడుతలతోనే కాలక్షేపం...
ఇంట్లోకి వచ్చే ఉడతలకు స్వయంగా ఆహారం తినిపిస్తూ... మచ్చిక చేసుకున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో అనితారెడ్డికి వీటితోనే కాలక్షేపం. వాటికోసం చిన్ని చిన్న గూళ్లనీ ఏర్పాటు చేశారు. అంతేకాదు... పక్షుల కోసం ఇంటిచుట్టూ సహజసిద్ధంగా గూళ్లు కట్టారు. వేసవిలో కోతులు, కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు నీటిని అందుబాటులో ఉంచారు. ప్రకృతిని రక్షిస్తే... అదే మనల్ని కాపాడుతుందని అనితారెడ్డి అంటున్నారు.
ఎండాకాలంలో మూగజీవాలెన్నో... నీళ్లు ఆహారం దొరక్క చనిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లల్లో అందరూ మూగజీవాలకు నీళ్లు ఆహారం అందుబాటులో ఉంచి... వాటి ప్రాణాలు రక్షించాలని అనితారెడ్డి కోరుతున్నారు.