YS Sharmila Praja Prasthana Padayatra: వరంగల్ జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్ర పునఃప్రారంభం తర్వాత రెండో రోజు జిల్లాలో పర్యటించిన షర్మిల.. ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో తెలంగాణలో అప్పులు లేని రైతులే లేరని వైఎస్ షర్మిల విమర్శించారు. బంగారు తెలంగాణ అనేది ప్రజలకు జరగలేదని... కేసీఆర్ కుటుంబానికే అయిందని ఆరోపించారు.
స్కూటర్లో తిరిగే కేసీఆర్ విమానాల్లో తిరుగుతున్నాడు: వరంగల్ జిల్లా నెక్కొండ నుంచి రెండో రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడువునా పార్టీ కార్యకర్తలు ఆమెపై పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ వారి దగ్గరకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని, కేజీ టూ పీజీ ఉచిత విద్య అని కేసీఆర్ ప్రజలను మోసం చేశారని షర్మిల విమర్శించారు. బంగారు తెలంగాణ అనేది ప్రజలకు జరగలేదని... కేసీఆర్ కుటుంబానికే అయిందని ఆరోపించారు. ఒకప్పుడు స్కూటర్లో తిరిగే కేసీఆర్ నేడు విమానాల్లో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ మళ్లీ వస్తాడు ఆకాశంలో చందమామను చూపిస్తాడు : పేదలకు మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, ఏకకాలంలో రుణమాఫీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు అన్ని విధాలా ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. గడిచిన 8 ఏళ్లలో ఉద్యోగాలు లేక వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రజల సమస్యల కోసం సీఎం కేసీఆర్ బయటకు రాడు.. కాని కేవలం ఓట్ల కోసం మాత్రమే బయటకు వస్తాడన్నారు. ఈసారి ఎన్నికలు వస్తున్నాయి.. సీఎం కేసీఆర్ మళ్లీ వస్తాడు ఆకాశంలో చందమామను చూపిస్తాడని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
'ప్రజల కష్టాలు చూసి మహిళనైనా నేను 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నన్ను ఆశీర్వదిస్తే మళ్లీ వైఎస్ఆర్ పాలన ప్రతి గడపకు చేరుస్తా. వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తాను. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు మహిళ పేరు మీద కట్టిస్తా. వైఎస్సార్ ప్రతి పథకానికి జీవం పోయడమే కాక అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి పెన్షన్ అందిస్తాను. నా మొదటి సంతకం ఉద్యోగాల ప్రకటన మీద పెడతాను.'-వై.ఎస్. షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత : ప్రజాప్రస్థానం పాదయాత్రలో పర్వతగిరి మండలం తుర్కులసోమారం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌పై షర్మిల ఘాటు విమర్శలు చేశారు. ఆగ్రహంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వైఎస్సార్టీపీ ఫ్లెక్సీలు చింపేశారు. అనంతరం కారులో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ నుంచి పరారయ్యారు. దాంతో ఫ్లెక్సీలు చించిన వారిని అరెస్టు చేయాలని వైతెపా శ్రేణులు ధర్నా రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని సముదాయించడంతో ఆందోళన విరమించారు.
Sharmila Padayatra resumes Yesterday: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాద యాత్ర వరంగల్ జిల్లాలో ఆగిన చోటి నుంచే పునఃప్రారంభమైంది. గురువారం హైదరాబాద్ లోటస్‌పాండ్ నుంచి బయలుదేరిన షర్మిల సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్టీపీ ముఖ్య నేతలతో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరమ్మతండా వద్దకు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు ఆమెపై పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. అక్కడే తన వెంట తెచ్చిన వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు.
ఇవీ చదవండి: