అనారోగ్యం, ఒంటరితనం ఓ వృద్ధ దంపతుల ప్రాణాలు వదిలేందుకు కారణమైంది. బిడ్డలకు భారం కాలేక.. అవస్థలు పడుతూ జీవించలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వరంగల్ రూరల్ జిల్లాలోని ఖానాపురం మండలం అశోకనగరంలో ఈ ఘటన జరిగింది.
తొగరు అల్లూరి, ఎల్లమ్మ దంపతులు అశోకనగరంలో జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు సంతానం. ఒక కుమారుడు అశోకనగరంలో.. మరొకరు చిలుకమ్మనగర్‌లో.. కుమార్తె రాయపర్తిలో నివసిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న అల్లూరి గత నాలుగైదు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్యే కూలి చేసి భర్తను పోషిస్తోంది. లాక్డౌన్ కారణంగా వృద్ధ దంపతులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. భర్త ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారడంతో భార్యకు ఆందోళన ఎక్కువయింది. దీనికి తోడు ఒంటరితనం వారిని మరింత కుంగతీసింది. ఒకరినొదిలి మరొకరు ఉండలేక... ఒంటరితనాన్ని భరించలేక.. లోకాన్ని విడిచివెళ్లిపోవాలనుకున్నారు. పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఉదయం ఇంటికొచ్చిన కుమారుడికి బాత్రూంలో విగతజీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులు కనిపించారు. ఆందోళన చెందిన అతను ఇరుగుపొరుగు వారిని, వైద్యుడిని తీసుకొచ్చాడు. అప్పటికే దంపతులు మరణించినట్లు వైద్యుడు ధ్రువీకరించాడు. సమాచారం అందుకున్న ఖానాపురం పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి: ఫోన్ కోసం పురుగుల మందు తాగిన తల్లీకూతుళ్లు