వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని సంజీవని ఆశ్రమం పిల్లలు మట్టితో గణపతి విగ్రహాలను తయారుచేసి ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన రంగురంగుల వినాయక విగ్రహాలు ప్రకృతికి హాని కలిగిస్తున్నాయని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆశ్రమం ఛైర్మన్ డాక్టర్ మోహన్‌రావు తెలిపారు. రసాయనాలతో కూడిన రంగులతో రూపొందించిన విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల జలచరాలు మృత్యువాత పడుతున్నాయని.. నీరు కలుషితం అవడం వల్ల ఇతర మూగజీవాలు వ్యాధుల బారిన పడుతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. ఆశ్రమంలో సుమారు 1000 మట్టి విగ్రహాలను తయారుచేసి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడి ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని నిర్వాహకులు సూచించారు.
ఇదీ చూడండి :హన్మకొండలో వినాయక చవితి సందడి