వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం ఊకల్కు చెందిన బాలిక సమత చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటోంది. డాక్టర్ కావాలన్న తన కలలకు కళ్లెమేసి.. పెళ్లి చేయాలని యత్నించిన పెద్దలను ధైర్యంగా ఎదిరించింది. బాల్య వివాహం చేస్తున్నారంటూ జిల్లా సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేసింది.
వర్ధన్నపేట కేజీబీవీలో ఇంటర్ చదివిన బాలిక 886 మార్కులతో టాపర్గా నిలిచింది. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఉన్నా...ఆన్లైన్ తరగతులు వినేందుకు సమత వద్ద స్మార్ట్ ఫోన్ లేదు. తన పరిస్ధితిని జిల్లా కలెక్టర్కు లేఖ ద్వారా తెలియచేయగా.. స్పందించిన కలెక్టర్ ఆమెకు స్మార్ట్ ఫోన్ని కానుకగా ఇచ్చారు. బాగా చదువుకొని డాక్టరవ్వాలని ఆకాంక్షించారు.