Heavy Rains in Warangal : వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 108 గ్రామాల నుంచి.. 10,698 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. వరంగల్, హనుమకొండలోని బస్తీల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.
Warangal Roads Damage Rains : ములుగు జిల్లాలోని ఓ పాఠశాలలోకి వరద నీరు రావడంతో వారిని ఇతర పాఠశాలకు చేరవేసినట్లు వివరించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ అంజనీ కుమార్, అదనపు డీజీపీ సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గురువారం ఉదయం వరకు పోలీస్ శాఖ ద్వారా సుమారు 2900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు డీజీపీ వెల్లడించారు.
Rain Damage in Warangal : రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయితీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారులు 5వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా.. ఐదు చోట్ల డైవర్షన్ రోడ్లు తెగిపోయాయి. కొన్ని చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. సుమారు రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు జాతీయ రహదారులకు నష్టం వాటిల్లినట్లు రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో 55 కిలోమీటర్ల మేర రోడ్లు కోతకుగురికాగా.. వందకు పైగా రోడ్లు ధ్వంసమయ్యాయి. సర్ఫేజ్ రోడ్లు 68.26 కిలోమీటర్లు, క్రాస్ డ్రైనేజీ వర్క్స్ రోడ్లు 77 వరకు.. దెబ్బతిన్నాయి. వాటి మరమ్మత్తులకు రూ.16.42 కోట్ల వరకు ఖర్చవుతాయని.. పంచాయతీరాజ్ అధికారులు అంచనాలు రూపొందించారు. చాలాచోట్ల రాష్ట్ర రహదారులు కోతకు గురయ్యాయి. 200 కిలోమీటర్ల పరిధిలో సర్ఫేజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. 15 ప్రాంతాల్లో రోడ్లు కోతలకు గురయ్యాయని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల్లో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు.. ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎన్పీడీసీఎల్ పరిధిలో.. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వివరించారు. హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడం వల్ల చాలా చోట్ల లైన్లు, డీటీఆర్‌లు, సబ్ స్టేషన్లు మునిగిపోవడంతో నష్టం వివరాలు అంచనా వేయలేకపోతున్నామని చెప్పారు.
ఎన్పీడీసీఎల్ పరిధిలో దాదాపు 20 సబ్‌స్టేషన్లలోకి నీళ్లు వచ్చి చేరాయని, 33 కేవీ ఫీడర్లు.. 46 బ్రేక్ కాగా 38 సరిదిద్దినట్లు అధికారులు తెలిపారు. కొన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు 1,208 విద్యుత్ స్తంభాలు, 62 డీటీఆర్‌లు దెబ్బతినగా.. వెంటనే మరమ్మత్తులు చేసి సరఫరా పునరుద్దరించినట్లు గోపాలరావు తెలిపారు. మిగిలిన చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టగానే సరఫరా అందిస్తామని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 18004250028కు లేదా 1912కు సంప్రదించాలని ఆయన సూచించారు.
ఇవీ చదవండి: