తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది రాజుల పాలనలోని అనేక విశిష్ట కట్టడాలు. అందులోనూ ఓరుగల్లు అనగానే తలంపుకొచ్చేది కాకతీయ తోరణం, కోట, వేయిస్తంభాల గుడి, త్రికూటాలయం ఇలా పలు నిర్మాణాలు కొలువుదీరి వారసత్వ నగరంగా ఎంపికయ్యింది. నేడు అధికారుల నిర్లక్ష్యంతో చరిత్ర నమూనాలు కాలగర్భంలో కలిసిపోవాల్సిన ప్రమాదం ఏర్పడుతోంది.
కాకతీయుల కళావైభవం
కాకతీయుల పరిపాలనలో చెరగని ముద్ర వేసుకున్న రాజులలో మొదటివాడు గణపతి దేవుడని చెప్పవచ్చు. గణపతిదేవుని కాలంలో అనేక ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారు. కాకతీయులు శివున్ని ఆరాధ్య దైవంగా కొలిచే వారని అందుకే వారి కాలంలో అనేక శివాలయాలు నిర్మించినట్లు చరిత్రకారులు వెల్లడించారు. ఖిలా కోట కేంద్రంగా కాకతీయులు పరిపాలన సాగించారని కోటలోకి రావాలంటే కట్టుదిట్టంగా ఏర్పరచిన ఎత్తైన గోడ నిర్మాణాలను దాటి రావాలని చరిత్ర చెబుతోంది. వాటిలో ఒకటి మట్టి గోడ, రాతి గోడ నేటికీ పర్యటకులకు కనువిందు చేస్తాయి.
శిల్ప కళను ప్రతిబింబించే త్రికూటాలయం
కాకతీయులు నిర్మించిన ఆలయాలలో త్రికూటాలయం ఒకటి. మట్టికోట దిగువన కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో మూడు శివాలయాల కలయికతో ఆలయ నిర్మాణం చేశారు. ఎత్తైన రాతి స్తంభాలకు నర్తకి దేవతామూర్తులను అద్భుతంగా తీర్చిదిద్దారు. 16 ఏకశిలా స్తంభాలతో ఆలయాన్ని నిర్మించారు.
కనుమరుగవుతున్న చరిత్ర
కొద్దికాలంగా సంభవిస్తోన్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ ఆలయం కొంతమేర దెబ్బతింది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన ఆలయం చిన్నపాటి వర్షానికి నీళ్లు కారుతూ శిథిలావస్థకు చేరుకుంది. కాకతీయుల కాలంలో ఎంతో వైభవంగా వెలిగిన ఈ ఆలయానికి ఆదరణ కరవైంది. వారసత్వ నగరంగా ఎంపికైన ఓరుగల్లులో కాకతీయుల చారిత్రక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఆలయానికి వెళ్లేందుకు కనీసం రోడ్డు మార్గమైనా లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతమేర ఉందో కళ్లకు కట్టినట్టుగా కనపడుతోంది.
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సమన్వయంతో ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఓరుగల్లు వాసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి :ఎంజీఎం ఆస్పత్రిలో బాలుడి అదృశ్యం