BRS Latest news : అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలలే ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు క్రమంగా బయట పడుతున్నాయి. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ్యుడు రాజయ్య.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బీఆర్ఎస్ టిక్కెట్‌కు పోటీకి వస్తారనే కారణంతో కడియం శ్రీహరిపై అవకాశం వచ్చినప్పుడల్లా రాజయ్య దాడి చేస్తున్నారు.
MLA Rajaiah And Kadiam Srihari Class war : కడియం శ్రీహరి కూడా ఎదురుదాడి దిగుతున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకుని ఇద్దరినీ కట్టడి చేసింది. కేటీఆర్ హెచ్చరికలతో ప్రస్తుతమైతే వీరిరువురూ పరస్పర విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టారు కానీ అది ఎన్నాళ్లు పాటిస్తోరో తేలాల్సి ఉంది.
Janagama BRS leaders Dispute : జనగామ జిల్లాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. కొంతకాలంగా భూ వివాదాల్లో చిక్కుకుని సతమతమవుతున్నారు. కన్న కుమార్తే ఆయన అక్రమాలను ప్రశ్నిస్తూ రోడ్డెక్కారు. ముత్తిరెడ్డి కుమార్తె ఈసారి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కుమార్తెతోనే తలనొప్పులు ఓ పక్క నుండగా మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముత్తిరెడ్డికి మింగుడుపడడం లేదు. శ్రీనివాస్‌రెడ్డికి కొందరు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల బాసటగా నిలుస్తున్నారు. ముత్తిరెడ్డి వర్గీయులు కూడా టచ్‌లో ఉంటున్నట్టు వినికిడి.
భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనా చారి మధ్య ఎప్పట్నుంచో పచ్చగడ్డి వస్తే భగ్గమంటోంది. ఇటీవల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు పట్టణానికి వచ్చినప్పుడు ఇరు వర్గాల నాయకులూ తమ ఆధిక్యత చూపేందుకు పోటీలుపడ్డారు. పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఈ దఫా టిక్కెట్ తనకంటే తనకేనని ఇద్దరు నేతలు ధీమాగా ఉన్నారు.
Shankarnaik and Thakkellapally RavinderRao Dispute : మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు వర్గీయులదీ ఇదే దారి. శంకర్ నాయక్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ ముడుపుగల్, కేసముద్రంలో ఎమ్మెల్సీ వర్గం సమావేశమవడం చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతలే టిక్కెట్ ఇవ్వొదని సమావేశాలు నిర్వహించడం కార్యకర్తల్లో ఆందోళన రేపుతోంది.
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేపట్టిన పల్లె పల్లెకూ రెడ్యానాయక్ కార్యక్రమానికి ప్రజల నుంచే నిరసన సెగలు తగలుతున్నాయి. మరోవైపు మంత్రి సత్యవతి రాథోడ్ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలను నిరూపించాలంటూ మొగిలిచర్లలో మంత్రి వర్గీయులు నిరసనకు దిగారు. ఈసారి సత్యవతి రాథోడ్‌కి టిక్కెట్ ఇస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. సత్యవతి రాథోడ్ మాత్రం ఎలాంటి విమర్శలు చేయట్లేదు. అధిష్ఠానం అదేశిస్తే పోటీ చేస్తానని చెబుతున్నారు.
వరంగల్ తూర్పులో సైతం బీఆర్ఎస్లో వర్గ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వచ్చే ఎన్నికల్లో అధిష్ఠానం తనకే అవకాశం ఇస్తుందంటూ పైకి ప్రకటనలు చేస్తున్నా.. రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయోనని అంతర్గతంగా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి పోటీకొస్తున్నారని భావించి అంతర్గత సమావేశాల్లో వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కార్యకర్తలే చెబుతున్నారు.
Warangal MLAs and MLCs dispute : టిక్కెట్ వస్తుందో రాదో అన్న ఆందోళనలో కొందరు ఎమ్మెల్యేలు ఉండగా ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకుని కట్టడి చేయకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది.
ఇవీ చదవండి: